
పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు..
ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకుని మోసం చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో నిందితురాలిని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన వజ్రపు పాండు కుమార్తె మణిగా గుర్తించారు. విజయవాడకు చెందిన మధ్యవర్తులు అశోక్, శశికళ, రామకృష్ణ సహకారంతో సుమప్రియ పేరుతో యువకులకు పరిచయమై వివాహాలు కుదుర్చుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
పెళ్లి సమయంలో నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తూ, ఎదురుకట్నం లేదా ఇతర హామీలతో వివాహం చేసుకునేది. అనంతరం కొద్ది రోజులు భర్త ఇంట్లో ఉండి, అవకాశం చూసుకుని నగదు, బంగారం తీసుకుని ఎవరికి చెప్పకుండా పరారవడం ఆమె నేరపద్ధతిగా గుర్తించారు.
పెద్దవడుగూరు మండలం కాశేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది. 2025లో సుధీర్ రెడ్డి రూ.3.8 లక్షల ఎదురుకట్నం ఇచ్చి సుమప్రియను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత మూడు రోజుల పాటు ఇంట్లో ఉన్న నిందితురాలు, ఆరోగ్యం బాగోలేదని చెబుతూ పుట్టింటికి వెళ్లాలని కోరింది. ఆమెను రైలులో పంపించగా, నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద దిగిపోయి అదృశ్యమైంది.
ఆమె కోసం సుధీర్ రెడ్డి విస్తృతంగా గాలించినా ఆచూకీ లభించలేదు. వివాహం కుదిర్చిన మధ్యవర్తులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అనుమానం వ్యక్తమైంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.
విచారణలో మణి ఇప్పటికే మరో నలుగురిని కూడా ఇదే తరహాలో వివాహం చేసుకుని మోసం చేసినట్లు బయటపడింది. అంతేకాకుండా ఆమెకు ఇప్పటికే కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక భర్తకు మరో పెళ్లి విషయం తెలియకుండా వరుసగా ఐదుగురిని వివాహం చేసుకుని మోసాలకు పాల్పడినట్లు తేలింది.
ఇటీవల కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన వ్యక్తిని కూడా వివాహం చేసుకున్న మణి, పెళ్లైన ఆరు రోజులకే మదనపల్లె వైపు వస్తున్నట్లు సమాచారం అందడంతో పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలోని పోలీసు బృందం చాకచక్యంగా వ్యవహరించింది. మదనపల్లె మండలం చీకలబైలు సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది.
నిందితురాలితో పాటు ఈ మోసాలకు సహకరించిన మధ్యవర్తుల పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాహ సంబంధాలు కుదుర్చుకునే ముందు పూర్తిస్థాయి వివరాలు సేకరించి, ధ్రువీకరణ అనంతరమే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
అమరావతిలో హైటెన్షన్...వైసీపీ నేతలను అడ్డుకున్న రాజధాని రైతులు
.