Lohagad Fort Murder Conspiracy : మహారాష్ట్రలోని లోహ్‌గఢ్ కోటపై జరిగిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ (25) హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కాబోయే భర్తను ప్లాన్ ప్రకారం కొండపై నుంచి నెట్టేసి, దానిని ఒక ట్రెకింగ్ ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన వధువు సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)ల ఇప్పటికే అరెస్ట్ కాగా.. పోలీసుల విచారణలో షాకింగ్ కామెంట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేతన్‌ను చంపడానికి కారణం.. అతడు విగ్ ధరించడమే అని, అందువల్లే అతడితో తనకు పెళ్లి ఇష్టం లేదని సియా చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. మరి ఆయన ఏమన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. నిశ్చితార్థానికి ముందే ఆ విషయం తెలుసు..!మెడికల్ కారణాల వల్ల కేతన్కు తలపై ఒక చిన్న భాగంలో జుట్టు ఊడిపోయిందని, ఈ విషయాన్ని పెళ్లి ఖరారు కావడానికి చాలా కాలం ముందే సియా కుటుంబానికి స్పష్టంగా వివరించామని విశాల్ అగర్వాల్ పేర్కొన్నారు. సియాకు కేతన్ నచ్చకపోవడానికి ఇదే కారణం అని తాను భావించడం లేదని.. ఒకవేళ ఈ కారణంతోనే ఆమె కేతన్‌ను వద్దు అనుకుని ఉంటే నేరుగా చెప్పేసి పెళ్లి రద్దు చేసుకునే అవకాశం ఆమెకు ఉందని వివరించారు. కారణం ఏదైనప్పటికీ ఆమె తన కుమారుడి ప్రాణాలు తీయడం దారుణం అని కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ చంపేందుకు చాలానే ప్రయత్నాలు..!మొదట్లో ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా సియా నమ్మించినప్పటికీ.. కేతన్ సోదరికి కల్గిన అనుమానంతో.. ఆమె గుట్టురట్టయింది. ముఖ్యంగా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందనే ప్రశ్నలకు కూడా సియా నీళ్లు నమలడంతో.. ఆమెకు అనుమానం వచ్చి తండ్రికి చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు.. సియా కాల్ డేటా పరిశీలించారు. అలాగే ప్రమాదం జరగడానికి ముందు నుంచి లోహగఢ్ కోటలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈక్రమంలోనే.. జూన్ 18న ఎండ తీవ్రత 33 డిగ్రీలుగా ఉన్నప్పటికీ.. ఒక వ్యక్తి హుడీ ధరించి వారి వెనుకాలే వెళ్లడం పోలీసులు గమనించారు. ఆ వ్యక్తే సియా ప్రియుడు చేతన్ చౌదరిగా గుర్తించారు. నిందితుల కాల్ డేటాను పరిశీలించగా ఇద్దరి మధ్య వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ జరిగినట్లు తేలింది.అంతకుముందు మే 31, జూన్ 4 తేదీల్లో కూడా సియా పదే పదే కేతన్‌ను కోటపైకి తీసుకెళ్లింది. జూన్ 14న ఒకసారి కేతన్‌ను లోయలోకి నెట్టేయడానికి ప్రయత్నించగా.. అతను అదృష్టవశాత్తూ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు అక్కడ పాము ఉందంటూ సియా నమ్మించింది. చివరకు బాలిలో జరగాల్సిన ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను కూడా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించి రద్దు చేయించింది. నిశ్చితార్థం రద్దు చేసుకుని పారిపోతే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే సియా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చేతన్ పోలీసులకు తెలిపాడు.ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ..మరోవైపు సియా తల్లిదండ్రులు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు. జూన్ 17 రాత్రి కేతన్, అతని తల్లి వీడియో కాల్ చేసి బలవంతం చేయడం వల్లే సియా ఆ ట్రిప్‌కు ఒప్పుకుందని తల్లి వాదించింది. ఉదయ్‌పూర్‌లో ప్లాన్ చేసిన పెళ్లి ఖర్చు భారీగా ఏమీ లేదని, కేవలం రూ. 3 కోట్లలోపే ఉంటుందని సియా తండ్రి తెలిపారు. ఈ కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా కేతన్ తండ్రిని కలిసి పరామర్శించారు. బాధితులకు పూర్తి న్యాయం చేసేందుకు కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సీనియర్ అడ్వకేట్ ఉజ్వల్ నికమ్‌ను నియమించారు. విద్యావంతులైన యువతలో ఇలాంటి నేరపూరిత ఆలోచనలు రావడం సామాజిక ఆందోళన కలిగిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.