
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Indian Railway Finance Corporation: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13వేల 600 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. లార్సన్ అండ్ టూబ్రో సంస్థనుంచి హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు బాధ్యతలను తెలంగాణ సర్కారు తీసుకుంది. మెట్రోరైల్ మొదటి దశను ఏప్రిల్ 29వ తేదీన L&T (ఎల్అండ్టీ) నుంచి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 1,461 కోట్ల రూపాయల ఈక్విటీ చెల్లించి వంద శాతం షేర్లను కొనుగోలు చేసింది. అప్పటి వరకు మెట్రోరైల్ ప్రాజెక్టుపై ఉన్న 13 వేల 538కోట్ల అప్పును ప్రభుత్వంపై బదలాయింపు చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తర్వాత... మెట్రో రైల్ ప్రాజెక్టు రుణానికి చెల్లించే వడ్డీరేట్లు అధికంగా ఉన్నాయని గుర్తించిన సర్కార్ రుణాలను రీ షెడ్యూల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీంతో అధికార యంత్రాంగం ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం ముందు ఉంచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకోసం ప్రతిపాదిత రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది.
కోరిన విధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మే నెలాఖరు నాటికి రుణం మంజూరు చేస్తే... జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో మొదటిదశ ప్రభుత్వానికి యాజమాన్య హక్కు వస్తుందని, వడ్డీ చెల్లింపుల్లో ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ఇందుకు తగ్గట్టుగా రుణ మంజూరుకు సంబంధించి హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ , ఎల్ అండ్ టీ మెట్రోరైలు లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ మధ్య మే నెల 25న దిల్లీలో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం వచ్చే రుణ మొత్తాన్ని వాయిదాల చెల్లింపు విధానంపై స్పష్టత లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. మెట్రో ప్రాజెక్టు ఆదాయాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెల్లించాలా? మెట్రో నిర్వహణ ఖర్చులకు ఉపయోగించాలా? అనే విషయం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చెల్లింపుల ప్రాధాన్యతలపై సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. ఈ విషయంలో రాజకీయ అంశాలు ముడిపడి ఉండటంతో రుణంకింద ఇవ్వాల్సిన నగదు జమచేయడంలో జాప్యం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో ప్రభుత్వ అధికారుల అనుసరించే విధి విధానాలు సమ్మతంగా లేదని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ భావించింది. ఒప్పందం ప్రకారం ఐఆర్ఎఫ్సీకి రుణం తిరిగి చెల్లించేటప్పుడు మెట్రో ఆదాయం నుంచే నేరుగా చెల్లింపులు జరగాలని నిబంధన ఉంది. అయితే, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాత్రం మెట్రో నిర్వహణ, మరమ్మతుల ఖర్చులకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. వ్యవస్థీకృత విధానాలు, అధికారుల నిర్ణయాలకు పొంతన లేకపోవడంతో ఈనెల 15వ తేదీన విడుదల కావాల్సిన నిధులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
కిషన్ రెడ్డి చొరవతో తొలిగిన మెట్రో అడ్డంకులు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకున్న విధంగా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరుచేసిన 13వేల600 కోట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఖాతాలో జమగాకపోవడంతో కేంద్రప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘదృష్టితో పనిచేస్తుంటే… తెలంగాణనుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్ రెడ్డి నిధులు రానీకుండా అడ్డుకుంటున్నారని బహిరంగ సభలో విమర్శించారు. ఒప్పంద ప్రక్రియలు పూర్తయినా, కేవలం రాజకీయ కారణాలతోనే ఐఆర్ఎఫ్సీ నిధుల విడుదలకు అడ్డుపడ్డారని మండిపడ్డారు. కానీ తాజాగా ఢిల్లిలో కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో స్వయంగా కిషన్ రెడ్డి పాల్గొని మెట్రోకు ఉన్న అడ్డంకులను తొలిగించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా కేంద్రప్రభుత్వంపైనా, ప్రభుత్వ ప్రతినిధులపై బురదజల్లడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ ప్రతినిధుల అవగాహన రాహిత్యంతో మాట్లాడటం సరికాదని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ తీసుకునే రుణ మొత్తాన్ని చెల్లించే విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్యే ప్రధాన కారణమని, హైదరాబాద్ మెట్రోప్రాజెక్టుకు నిధులు ఇస్తుంటే ఎవ్వరూ అడ్డుకోలేదని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖరాశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు వచ్చే ఆదాయ వనరులు, తీసుకున్న రుణ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వానికి వివరించిన తర్వాతే ఒప్పందం చేసుకున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మెట్రో రైల్ సంస్థకు రోజువారి టిక్కెట్ల అమ్మకం, అద్దెలు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు రుణమిచ్చేందుకు ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆమోదం, రైల్వే మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు సమ్మతించిన తర్వాత ఒప్పందం జరిగింది. అయితే మంజూరు చేస్తామన్న నిధుల విడుదలలో జాప్యానికి కారణాలు తెలియరాలేదని అధికారులు ఆలోచనలో పడ్డారు. రుణ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలేమీలేవని ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు మంజూరైన రుణం విడుదలలో ఆలస్యంతో ప్రభుత్వంపై రోజుకు రెండున్నర కోట్ల భారం పడుతోందని తెలంగాణ సర్కారు సతమతమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.