
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. ప్రపంచవ్యాప్తంగా జూలై 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక రోజు ముందే గ్రాండ్...
అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. ప్రపంచవ్యాప్తంగా జూలై 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఒక రోజు ముందే గ్రాండ్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. జూలై 2న రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్ లోని అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన 'అల్లు సినిమాస్' డాల్బీ సినిమా థియేటర్ లో ఈ రెడ్ కార్పెట్ ప్రీమియర్ జరగనుంది.ఈ ప్రత్యేక ప్రదర్శన కోసం చిత్రబృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో కథ, స్క్రీన్ప్లే అందిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. 'ఒక పురాణ గాథకు నాంది' అంటూ ప్రచారం చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలతో కూడిన ఈ కథాంశం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.లక్ష్మీ ఇరా, దేవాన్ష్ నామా సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు సినిమాస్, 7 స్టూడియోస్ కూడా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రైమ్ వీడియో డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. ఈ ప్రీమియర్ వేడుకతో సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రంలో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించగా... నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలు. జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, మురళి శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.