
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఘనత సాధించిన రిషభ్ పంత్ మళ్లీ తన పాత జట్టుకు వచ్చేశాడు. గత మెగా వేలంలో రూ. 27 కోట్లతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తీసుకుని కెప్టెన్సీ అప్పగించింది.
కానీ, అతడు తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయాడు. దీంతో అతడిని దిల్లీకి ట్రేడ్ చేస్తూ లఖ్‌నవూ నిర్ణయం తీసుకుంది. కొత్త డీల్‌లో భాగంగా జీతంలో భారీకోతకు అంగీకరించాడు. ఇప్పుడు దిల్లీ పంత్‌కు రూ.15 కోట్లు చెల్లించనుంది. ఈ క్రమంలో రిషభ్ పంత్ ట్రేడ్‌పై విశ్లేషించిన మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ దిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ మార్పుపైనా స్పందించాడు.
‘‘లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో రిషభ్ పంత్ గడిపిన సీజన్లు.. ఆ తర్వాత అతడు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలను చూస్తే ఇప్పుడీ ట్రేడ్ ఆశ్చర్యం కలిగించలేదు. ఎల్ఎస్జీపై తీవ్ర అసహనంతో ఉన్నాడని అప్పుడే సంకేతాలు కనిపించాయి. అక్కడి యాజమాన్యం, కోచింగ్ సిబ్బంది వల్ల కూడా ఇది అయి ఉండొచ్చు. ఇప్పుడు మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌కు వచ్చేశాడు’’ అని ఏబీడీ వెల్లడించాడు.
‘‘ఐపీఎల్లో ఒక జట్టు అత్యంత విజయవంతమైందంటే దానికి కారణం కేవలం ప్లేయర్లు మాత్రమే కాదు. మేనేజ్మెంట్ సహకారం, కోచింగ్ సిబ్బంది పాత్ర కూడా కీలకమే. కానీ, దిల్లీ క్యాపిటల్స్‌లో అదే సమస్యగా మారిందేమో అనిపించింది. ఇప్పుడు మళ్లీ సౌరభ్ గంగూలీ డైరెక్టర్‌గా వచ్చారు. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కోచ్. ఇక రిషభ్ పంత్ కూడా జట్టులోకి వచ్చేశాడు. మరి ఇవి జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. అయితే యాజమాన్యంలో మార్పు, కోచింగ్ సిబ్బంది వస్తూ పోతూ ఉండటం కచ్చితంగా గందరగోళం సృష్టిస్తుంది. ఈ మార్పులను సానుకూల దృక్పథంతో తీసుకొని పరిస్థితులకు అలవాటు పడటం ఆటగాళ్లకు కష్టంగా మారే అవకాశం లేకపోలేదు’’ అని ఏబీడీ విశ్లేషించాడు. గత రెండేళ్లు జీఎంఆర్ నిర్ణయాలు తీసుకోగా.. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ ఆ స్థానంలోకి వచ్చింది. ఈ రెండు సంస్థలు ఉమ్మడిగానే దిల్లీ క్యాపిటల్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.