
తల్లయ్యాక కెరీర్‌ని కొనసాగించడం కష్టమనుకుంటారు కొందరు. అందులోనూ క్రీడల్లో ఇది సాధ్యమయ్యే పనే కాదనుకుంటారు మరికొందరు. అమ్మతనం తమ ఆటకు అడ్డుపడకుండా ప్రెగ్నెన్సీని వాయిదా వేసే క్రీడాకారిణులూ లేకపోలేదు.
తల్లయ్యాక కెరీర్‌ని కొనసాగించడం కష్టమనుకుంటారు కొందరు. అందులోనూ క్రీడల్లో ఇది సాధ్యమయ్యే పనే కాదనుకుంటారు మరికొందరు. అమ్మతనం తమ ఆటకు అడ్డుపడకుండా ప్రెగ్నెన్సీని వాయిదా వేసే క్రీడాకారిణులూ లేకపోలేదు. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రసవానంతరం మహిళా క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ‘అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ)’ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. బిడ్డ పుట్టాక వారు సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏ మహిళా క్రికెటర్ కెరీర్‌కూ మాతృత్వం అడ్డుకాదని చెబుతూనే, క్రికెట్లో మహిళా సాధికారతను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన ఈ మార్గదర్శకాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సైతం ‘ఇది చరిత్రాత్మక ఘట్టం.. మహిళా క్రికెటర్లకు దక్కిన గొప్ప గుర్తింపు’ అంటూ ఐసీసీ నిర్ణయాన్ని ప్రశంసించింది.
ఆటల్లో రాణించాలంటే శారీరక ఫిట్నెస్, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అయితే ప్రసవానంతరం ఈ రెండింటినీ కోల్పోతారు మహిళలు. తిరిగి పుంజుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ వ్యవధిలో ఎన్నో అవకాశాలు చేజారిపోతాయి. దీంతో తమ కెరీర్ మధ్యలోనే ఆగిపోతుందన్న భయం చాలామంది క్రీడాకారిణుల్ని వెంటాడుతుంటుంది. ఈ భయాన్ని పోగొట్టి.. కొత్తగా తల్లైన మహిళా క్రికెటర్లను తిరిగి కెరీర్లో ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే తాజాగా కొన్ని మార్గదర్శకాల్ని తీసుకొచ్చింది ఐసీసీ.
సాధారణంగా కొత్తగా తల్లైన క్రీడాకారిణులు తిరిగి ఆటలోకి అడుగుపెట్టాలంటే.. వాళ్లే వ్యక్తిగతంగా సంబంధిత నిపుణుల్ని నియమించుకొని ఆయా అంశాల్లో శిక్షణ పొందుతుంటారు. కానీ ఐసీసీ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఈ క్రికెట్ కమిటీనే స్వయంగా ఈ బాధ్యత తీసుకోనుంది. ప్రసవానంతరం మహిళా క్రికెటర్లను తిరిగి శారీరకంగా, మానసికంగా దృఢంగా మార్చేందుకు ఆరు ‘R’లతో కూడిన ఆరంచెల ఫ్రేమ్‌వర్క్‌ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వారికి కనీసం 16 వారాల పాటు ఆయా అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. అదెలాగంటే..
Ready - మొదటి ఆరు వారాలు కొత్తగా తల్లైన మహిళా క్రికెటర్ల ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఈ క్రమంలోనే సంబంధిత వైద్య, వ్యాయామ నిపుణుల సమక్షంలో.. కటి వలయ కండరాల్ని బలోపేతం చేయడానికి వారితో ప్రాథమిక వ్యాయామాలు సాధన చేయిస్తారు. ఇందులో భాగంగా నెమ్మదిగా నడకతో ప్రారంభించి.. క్రమంగా వేగాన్ని, సమయాన్ని పెంచుకుంటూ పోతారు. అలాగే మహిళా క్రికెటర్లు తల్లిగా తమ జీవనశైలికి అలవాటు పడేందుకు మానసిక నిపుణులు అవసరమైన సహాయం అందిస్తారు.
Review - ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కొనసాగే ఈ ప్రణాళికలో భాగంగా.. గైనకాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, పోషకాహార నిపుణులు, మానసిక నిపుణులు.. మహిళా క్రికెటర్ ఆరోగ్యాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలిస్తారు. దాన్ని బట్టే ఆమె ఆహార, వ్యాయామ నియమాల్లో మార్పులు-చేర్పులు చేస్తారు.
Restore - 8 నుంచి 16 వారాల పాటు సాగే ఈ ప్రణాళికలో భాగంగా.. మహిళా క్రికెటర్ల శారీరక సత్తువను పెంచేందుకు శిక్షణ ఇస్తారు. ఇది ఒక రకంగా ఆటలో కొనసాగేటప్పుడు పాటించే వ్యాయామ రొటీన్‌లా ఉంటుందని చెప్పచ్చు.
Recondition - ఇందులో భాగంగా క్రికెటర్ తన క్రీడా నైపుణ్యాల్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంటే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సాధన చేస్తూ మళ్లీ వాటిపై పట్టు సాధించడం దీని ముఖ్యోద్దేశం. కనీసం 12 నుంచి 16, అంతకంటే ఎక్కువ వారాల పాటు సాగే ఈ శిక్షణ కాలాన్ని.. క్రికెటర్ తిరిగి తన నైపుణ్యాలను పెంపొందించుకునే తీరును ఆధారంగా చేసుకొని పొడిగిస్తారు.
Return - ఇందులో భాగంగా మహిళా క్రికెటర్లకు అధికారిక మ్యాచుల్లో ఆడే అవకాశం కల్పిస్తారు. తద్వారా తిరిగి టీమ్ వాతావరణానికి, పోటీ తత్వానికి అలవాటు పడేలా చూస్తారు.
Refine - ఇలా ప్రసవం తర్వాత తిరిగి జట్టులోకొచ్చాక నిర్ణీత వ్యవధుల్లో క్రీడాకారిణి ఆరోగ్యం, ఫిట్నెస్, మానసిక స్థితిగతులు.. వంటివన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఇలా దీర్ఘకాలం పాటు వారి ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది ఐసీసీ.
ఇలా ఓవైపు మాతృత్వాన్ని, మరోవైపు కెరీర్‌ని.. రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగేలా క్రీడాకారిణులకు ఈ ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సైతం ‘ఇది చరిత్రాత్మక ఘట్టం.. మహిళా క్రికెటర్లకు దక్కిన గొప్ప గుర్తింపు’ అంటూ ఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించింది.
అయితే తల్లైన తర్వాత తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టిన క్రీడాకారిణులు ఈపాటికే కొందరున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇటు ఆటలో రాణిస్తూనే.. అటు అమ్మతనాన్నీ ఆస్వాదిస్తూ తోటి మహిళా క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
⚛ వెస్టిండీస్‌కు చెందిన ఎఫీ ఫ్లెచర్ 2021లో తల్లైంది. ఆ తర్వాత తిరిగి జట్టులోకొచ్చిన ఈ లెగ్ స్పిన్నర్.. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొంటూ అద్భుతంగా రాణిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడుతోన్న ఫ్లెచర్.. మ్యాచ్ అనంతరం అప్పుడప్పుడూ తన కొడుకుతో మైదానంలో సందడి చేస్తుంటుంది.
⚛ పాకిస్థాన్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూడా 2021లో పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆపై తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టి సారథిగా జట్టును ముందుండి నడిపించింది. అయితే 2024, ఏప్రిల్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆమెకు గతేడాది డిసెంబర్లో బాబు పుట్టాడు.
⚛ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్నేహా దీప్తి దేశం తరఫున పలు వన్డేలు, టీ20 మ్యాచులాడింది. 2021లో పాపకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాతా అటు అమ్మతనాన్ని, ఇటు కెరీర్‌ని బ్యాలన్స్ చేస్తూ కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లాడింది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడుతోంది స్నేహ.
⚛ న్యూజిలాండ్ ప్లేయర్ అమీ శాటర్త్వైట్కు 2020లో పాప, 2024లో బాబు పుట్టారు. పాప పుట్టాక రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన ఆమె.. 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2023లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. ప్రస్తుతం కోచ్‌గా మారి కొత్త తరం క్రికెటర్లను తయారుచేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.