
ఆధునిక ప్రజాస్వామ్యానికి, చట్టబద్ధ పాలనకు పునాదిగా భావించే ‘మాగ్నా కార్టా’ కన్నా శతాబ్దాల ముందే భారతదేశంలో సమానత్వ భావన పుట్టిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
కౌటిల్యుడు రచించిన ‘అర్థశాస్త్రం’లోనే దీని మూలాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 14వ సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ న్యాయ ఫోరమ్‌లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.1215లో వచ్చిన మాగ్నా కార్టా.. రాజుతో సహా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలనే విప్లవాత్మక సూత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందని చెబుతారని, కానీ అంతకంటే ముందే నాలుగో శతాబ్దంలోనే కౌటిల్యుడి అర్థశాస్త్రం సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందని తాను వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నట్లు జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సంస్కృతంలో రచించిన అర్థశాస్త్రాన్ని మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ప్రధాన సలహాదారుడైన కౌటిల్యుడు రచించారు.ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. చట్టం సమానంగా అందుబాటులో ఉండటం అనేది కేవలం ఒక ప్రక్రియగా మిగిలిపోకూడదని, అది ప్రజలకు వాస్తవ హక్కులను అందించాలని స్పష్టం చేశారు. "చట్టపరమైన హామీలను వల్లెవేయడం కాదు.. భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి వాటి ఫలాలను ప్రజలకు అందించడమే అసలైన సవాల్" అని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కూడా పౌరులందరికీ చట్టం ముందు సమానత్వం, గౌరవంగా జీవించే హక్కు వంటి అనేక ప్రాథమిక హక్కులను అందించిందని గుర్తుచేశారు. వలసవాదం, పేదరికం వంటి సమస్యల నుంచి బయటపడి అనేక దేశాలు ఇంకా తమ వ్యవస్థలను నిర్మించుకుంటున్నాయని ఆయన అన్నారు.