
వైవాహిక బంధం నుంచి పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరటనిచ్చే కీలక తీర్పునిచ్చింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బి(2) కింద పేర్కొన్న ఆరు నెలల కూలింగ్ ఆఫ్ (నిరీక్షణ) కాలం కేవలం సూచనాత్మకమే తప్ప.. తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. దంపతుల మధ్య రాజీకి ఏమాత్రం అవకాశం లేనప్పుడు, వివాదాలన్నీ సర్దుమణిగినప్పుడు ఈ గడువును మినహాయించవచ్చని పేర్కొంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ దంపతులు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను అనుమతిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.ప్రకాశం జిల్లాకు చెందిన హర్షవర్ధిని, మనోహర్‌లకు డిసెంబర్ 2022లో వివాహమైంది. అయితే, మనస్పర్థల కారణంగా ఏడాదికి పైగా వీరు విడివిడిగా జీవిస్తున్నారు. భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశం లేకపోవడంతో, ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే శాశ్వత భరణం (అలిమొనీ), ఆస్తి పంపకాలు, పిల్లల సంరక్షణ వంటి అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకున్నారు.అనంతరం ఒంగోలులోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. చట్టం ప్రకారం ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముగిసేలోపే కేసును త్వరగా విచారించాలని (అడ్వాన్స్‌మెంట్) కోర్టును కోరారు. అయితే, దంపతుల మధ్య వివాదాలు తొలిగేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఫ్యామిలీ కోర్టు ఈ విన్నపాన్ని తిరస్కరించింది. చట్టబద్ధమైన కూలింగ్ పీరియడ్ దాటవేయడం కుదరదంటూ దంపతుల పిటిషన్‌ను కొట్టేసింది.హైకోర్టును ఆశ్రయించిన దంపతులుఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హర్షవర్ధిని, మనోహర్ జంటగా హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. తాము ఇప్పటికే అన్ని వివాదాలను పరిష్కరించుకున్నామని, విడిపోవాలనే నిర్ణయంపై స్థిరంగా ఉన్నామని కోర్టుకు విన్నవించారు. విడాకుల కోసం పోరాడి ప్రేమను గెలిచి.. రెండు మనసులు ఒక్కటైన వేళఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. కూలింగ్ ఆఫ్ పీరియడ్.. ముఖ్య ఉద్దేశం దంపతులు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవడానికి, రాజీ పడటానికి సమయం ఇవ్వడమేనని గుర్తుచేశారు. కానీ, ఇప్పటికే చాలా కాలంగా విడివిడిగా ఉంటూ, అన్ని వివాదాలను పరిష్కరించుకున్న జంట విషయంలో ఈ నిబంధనను కఠినంగా అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కోర్టు అభిప్రాయపడింది. ఇది వారి కష్టాలను మరింత కాలం పొడిగించడమే అవుతుందని పేర్కొంది.సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా..ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ప్రముఖ తీర్పులను హైకోర్టు ఉదహరించింది. అమర్‌దీప్ సింగ్ వర్సెస్ హర్వీన్ కౌర్, అమిత్ కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్ కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల ప్రకారం.. మిగిలిన అన్ని నిబంధనలు నెరవేరినప్పుడు 6 నెలల నిరీక్షణ కాలాన్ని మినహాయించవచ్చని స్పష్టం చేసింది. పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! ఓ విలక్షణ కేసులో సుప్రీం తీర్పుఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు కీలక ఆదేశాలుప్రస్తుత కేసులో దంపతుల మధ్య కుదిరిన ఒప్పందం పూర్తిగా వారి స్వచ్ఛంద నిర్ణయమేనని, వారి మధ్య మళ్లీ కలయికకు ఎలాంటి అవకాశాలు లేవని హైకోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో మినహాయింపు ఇవ్వడానికి అవసరమైన అన్ని చట్టపరమైన అర్హతలు ఉన్నాయని పేర్కొంది.ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ.. వెంటనే ఈ కేసును విచారణకు స్వీకరించాలని ఒంగోలు కోర్టును ఆదేశించింది. చట్టప్రకారం ఈ విడాకుల పిటిషన్‌ను వీలైనంత త్వరగా (ఎక్స్‌పెడీషియస్‌గా) పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు పరస్పర అంగీకారంతో త్వరగా విడిపోవాలనుకునే ఎందరో దంపతులకు చట్టపరమైన ఊరటనివ్వనుంది.