
తుంగభద్ర డ్యాం కొత్తగేట్ల ప్రారంభం ఇదే సహకారంతో జల వివాదాలూ పరిష్కరించుకోండి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సూచన సమస్యలన్నీ తీరేది నదుల అనుసంధానంతోనే..
ప్రధాని మోదీ సాకారం చేస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కమిటీ ఏర్పాటు చేసి, జల వివాదాలను పరిష్కరించాలి కేంద్రాన్ని కోరిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రైతుల కోసం ఒక్కటయ్యామన్న కర్ణాటక సీఎం శివకుమార్
తుంగభద్ర గేట్లను మీట నొక్కి ప్రారంభించిన అనంతరం అభివాదం చేస్తున్న రామానాయుడు, సీఆర్ పాటిల్, డీకే శివకుమార్, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పయ్యావుల కేశవ్
ఈనాడు, బెంగళూరు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర 73 ఏళ్ల తర్వాత కొత్త శోభను సంతరించుకుంది. ఏడు దశాబ్దాలుగా మూడు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించిన ఈ ఆనకట్టకు కొత్తగా అమర్చిన 33 స్పిల్‌వే గేట్ల పునరుద్ధరణ, వాటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఓ అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. తుంగభద్ర ఆనకట్ట విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒకే వేదికపైకి వచ్చి జల సంరక్షణ కోసం సంఘీభావాన్ని ప్రకటించారు. కర్ణాటకలోని హొసపేటె సమీప తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ గురువారం ప్రారంభించారు. 17, 18, 19, 20 గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసి వీటిని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కర్ణాటక విధానపరిషత్తు స్పీకర్ బసవరాజ హొరట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కర్ణాటక జలవనరుల శాఖ, తుంగభద్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.
గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్‌ను ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు అన్నారు. గోదావరి, కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అవసరాలన్నీ తీరతాయన్నారు. ముందుగా రాష్ట్రాల్లోని నదులు, తర్వాత రాష్ట్రాల మధ్య నదులను అనుసంధానం చేస్తే జాతీయ స్థాయిలో అనుసంధాన ప్రక్రియ ఊపందుకుంటుందన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ మధ్య కెన్ బెట్వా ప్రాజెక్టును ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఈ నదుల అనుసంధానం సాధ్యమని ప్రకటించారు.
సభకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్, చంద్రబాబు
తుంగభద్ర 33 కొత్త గేట్ల అమరికతో ఈ ఆనకట్ట పరిసరాల్లోని మూడు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘బళ్లారి, అనంతపురం, కర్నూలు, పాలమూరు జిల్లాల వలసలు, రైతుల సమస్యలపై నాకు అవగాహన ఉంది. ఈ గేట్ల పునరుద్ధరణ లక్షల మంది రైతుల కన్నీరు తుడుస్తుంది. 1950లో మైసూరు మహారాజులు, హైదరాబాద్ నిజాముల కాలంలో తుంగభద్ర జలాశయ నిర్మాణానికి ఎంత ప్రాధాన్యం ఉందో అలాగే ఈ 33 గేట్ల పునరుద్ధరణ ఘట్టం కూడా చరిత్రలో నిలిచిపోతుంది. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ గేట్ల పునరుద్ధరణలో కీలకంగా వ్యవహరించారు’ అని కొనియాడారు. ‘మా రాష్ట్ర పరిసరాల్లో ప్రజలు నీరు లేక వలస వెళ్తున్నారు. మాకు దక్కాల్సిన నీరు సముద్రాల పాలవుతోంది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు సీఆర్ పాటిల్ నేతృత్వంలో రైతుల కోసం ఒక్కటవడం చరిత్ర. గద్వాల్, ఆలంపూర్, పాలమూరు జిల్లాల పరిధిలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా దక్కాల్సిన 15.9 టీఎంసీల నీటిలో కేవలం 5 టీఎంసీల నీరే వినియోగించుకుంటున్నాం. తుంగభద్రలో పూడికతో 10 టీఎంసీలు వృథా అవుతున్నాయి’ అని రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదుల నీటి పంపిణీ, నదుల అనుసంధానంపై రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం చూపాలని ఆయన ప్రతిపాదించారు.
దేశంలో 6 వేలకు పైగా జలాశయాల్లో 15 శాతం నీరు కేవలం పూడిక వల్ల వృథా అవుతోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ప్రధాని మోదీ దేశంలోని జలాశయాల పూడిక తొలగింపుపై త్వరలో ఓ ప్రకటన చేస్తారన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల సంయుక్త ఆధ్వర్యంలో తుంగభద్రలో పూడిక తొలగింపు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. దీనితో ఈ ఆనకట్ట నీటి సామర్థ్యం 25-30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ గేట్ల పునరుద్ధరణలో మూడు రాష్ట్రాలు చూపిన ఐక్యత పూడికతీత ప్రక్రియలోనూ చూపాలన్నారు.
ఈ-వాహనంలో తుంగభద్ర డ్యామ్‌కు చేరుకుంటున్న ముఖ్యమంత్రులు చంద్రబాబు, డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తదితరులు
కర్ణాటక సీఎండీకే శివకుమార్ మాట్లాడుతూ ముగ్గురు ముఖ్యమంత్రుల కలయిక చరిత్రలో నిలిచిపోయే సందర్భమన్నారు. మా నీరు, మా హక్కు నినాదంతో గేట్ల పునరుద్ధరణకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతుల కోసం ఒక్కటై, రాజకీయాలు మరచి సమన్వయంతో పనిచేశామని చెప్పారు. తుంగభద్ర నుంచి వృథా అవుతున్న 33 టీఎంసీల నీటి సంరక్షణ, నవిలి జలాశయం, పూడిక వంటి అంశాలపై ముగ్గురు ముఖ్యమంత్రులు కేంద్రమంత్రితో సమగ్రంగా చర్చించామన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టుల నిపుణుడు కన్నయ్యనాయుణ్ని సత్కరిస్తున్న కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్
ప్రకృతి విపత్తులతో జలాశయాల్లో నీటి ప్రమాణం తగ్గినా పెరిగినా, దేశాలు, రాష్ట్రాలు చివరకు జిల్లాల మధ్య తగాదాలొచ్చినా చివరకు నష్టపోయేది రైతులేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారం లభించాలంటే నదుల అనుసంధానం చేయాల్సిందేనని పిలుపునిచ్చారు. ‘నన్న ఎల్లా రైత బాంధవరిగే నన్న నమస్కారగళు (నా రైతు బంధువులకు నా నమస్కారాలు) అని కన్నడంలో ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. రైతుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ‘ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్రతో పాటు ఆలమట్టిలోనూ ఇన్‌ఫ్లో లేదు. ఒక్కోసారి వరద ముంచుకొస్తుంది. ఈ రెండు సందర్భాల్లో నీటిని పొదుపుగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం అనివార్యం. తుంగాపానం, గంగా స్నానం (తుంగభద్ర నీరు తాగినా, గంగ నీటితో స్నానం చేసినా) ఎంతో పుణ్యం. ఇలాంటి తుంగభద్రకు గతేడాది 19వ గేట్ విరిగి పెను ప్రమాదం ముంచుకొస్తే వెంటనే ఆంధ్రప్రదేశ్ స్పందించి నిపుణుడైన కన్నయ్యనాయుడిని పంపి మరమ్మతులు ప్రారంభించింది’ అని చంద్రబాబు గుర్తు చేశారు. మొత్తం గేట్లను పునరుద్ధరించాలని సూచించగా అప్పట్లో జలవనరుల మంత్రి (ప్రస్తుత సీఎం) డీకే శివకుమార్ సకాలంలో స్పందించారని గుర్తుచేశారు. ఇరు రాష్ట్రాలు రూ.51 కోట్ల నిధులను సమకూర్చి కేవలం ఆరు నెలల్లోనే ఈ కొత్త గేట్లు బిగించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు. జలసంరక్షణ ప్రభుత్వాల బాధ్యతనే ఉద్దేశంతో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి చరిత్ర సృష్టించామని చెప్పారు. ఈ కలయిక రాష్ట్రాల భవిష్యత్తుకు నాందిగా చంద్రబాబు అభివర్ణించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.