
ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థుల చేరిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలి ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి విద్యార్థుల...
ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో లక్షకు పైగా విద్యార్థుల చేరిక
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలి
ప్రాథమికోన్నత పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యానికి విద్యార్థుల ప్రవేశాలు
సెప్టెంబర్ 5 నుంచి 9,10 తరగతి విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానం
పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టిసారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లనుంచి… ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఏడాది 1,06,000 వేల మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ముఖ్యంగా ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉండగా.. 3,515(46.13%) పాఠశాలల్లో గరిష్ట సామర్థ్యం మేర విద్యార్థుల ప్రవేశాలు పొందారని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపైనా సమావేశంలో చర్చించారు. అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి ఫేజ్-1 కింద 175 లీప్ పాఠశాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ఏఐ ట్యూటర్ విధానాన్ని ప్రి పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. భవిష్యత్ లో క్లిక్కర్స్ కు ఏఐ ట్యూటర్ ను అనుసంధానించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ఐఈఆర్ పీఎస్ రెగ్యులరైజేషన్, హై స్కూల్ ప్లస్ లలో గెస్ట్ లెక్చరర్ల రిక్రూట్ మెంట్ అంశంపైనా సమావేశంలో చర్చించారు.
త్వరలో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన
అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు విశాఖలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటుపైనా సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన భవన నమూనాలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్ ఛార్జి) శ్యామలరావు, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.