
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయ చమురు ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. యుద్ధానికి ముందు నాటి పరిస్థితులు నెలకొంటున్నాయి.
అంతర్జాతీయంగా చమురు ధరలు గురువారం కనిష్ఠ స్థాయికి చేరాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర దాదాపు 72-73 డాలర్లకు, యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర ఓ దశలో 120 డాలర్లకు చేరడం గమనార్హం.
చమురు ధరలు తగ్గడం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌కు భారీ ఊరట కలగనుంది. ద్రవ్యోల్బణ ముప్పు తగ్గడమే కాకుండా, దిగుమతి ఖర్చులూ తగ్గనున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముందు రోజు ఫిబ్రవరి 27న బాస్కెట్ క్రూడ్ ఆయిల్ 71.17 డాలర్లకు భారత్ కొనుగోలు చేసింది. తాజాగా జూన్ 24 నాటికి భారత్ బాస్కెట్ బ్యారెల్ ధర 70.71 డాలర్లకు కొనుగోలు చేసినట్లు కేంద్ర పెట్రోల్, చమురు మంత్రిత్వశాఖ పేర్కొంది.
అయితే, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా రిటైయిల్ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. యుద్ధం సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.7.50 మేర పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పటికీ.. ఆ మేర ధరలు ఎందుకు తగ్గడం లేదనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. ప్రస్తుతం క్రూడాయిల్ ధర తగ్గిన నేపథ్యంలో పెట్రోల్‌పై చమురు సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయని, డీజిల్ అమ్మకాలపై స్వల్ప నష్టాలు వస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న సందర్భంలోనూ దాదాపు రెండున్నర నెలల పాటు దేశీయంగా ధరలు పెంచలేదని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు చమురు సంస్థలు రోజువారీ డేటా ఆధారంగా కాకుండా నెల రోజులు లేదా 15 రోజుల సగటు ధరల ఆధారంగా ఇంధన ధరలను సవరిస్తుంటాయి. అందువల్ల, ఈ తగ్గుదల ప్రభావం వినియోగదారులకు చేరడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.