
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Expert Warns Street Food During Monsoon: వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తీసుకునే ఆహారం పోషకాలతో పాటు అత్యంత పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. పీడియాట్రిషియన్ డాక్టర్ ఎన్. వర్షా మౌనిక రెడ్డి సూచనల ప్రకారం, స్ట్రీట్ ఫుడ్ విక్రయించే ప్రాంతాలు వైరస్లు, సూక్ష్మ క్రిములు వేగంగా పెరగడానికి అనువైన చోట్లు. వర్షాలు పడటం, నీరు నిల్వ ఉండటం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా అక్కడ ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ ఎందుకు ప్రమాదకరం?.. వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. ఫంగస్, వైరస్లు కూడా ఈ సమయంలో ఎక్కువగా వస్తాయి. మురికి ప్రాంతాలు, అపరిశుభ్రమైన పారిశుద్ధ్యం, నీటి కాలుష్యం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి.
స్ట్రీట్ ఫుడ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు.. వర్షాకాలంలో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే డయేరియా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషితమైన నీటి వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడి, పేగు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది.
టైఫాయిడ్.. WHO ప్రకారం.. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అపరిశుభ్రమైన గిన్నెలు, ఆహార పదార్థాల వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల జ్వరం, తల తిరగడం, నీరసం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
హెపటైటిస్ ఏ.. ఇది కాలేయంపై ప్రభావం చూపే వైరల్ ఇన్ఫెక్షన్. అపరిశుభ్రమైన ఆహారం, నీటి ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ విక్రయించే అపరిశుభ్ర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. హెపటైటిస్ బారిన పడితే జ్వరం, నీరసం, కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, వాంతులు, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఫుడ్ పాయిజనింగ్.. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ వల్ల వచ్చే ప్రధాన సమస్య ఫుడ్ పాయిజనింగ్. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం. పాడైపోయిన పదార్థాలను వాడటం, అపరిశుభ్రమైన వాతావరణంలో వండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల వాంతులు, కడుపునొప్పి, డయేరియా, జ్వరం, నీరసం వస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్.. ఆరోగ్య నిపుణుల ప్రకారం, తేమ ఎక్కువగా ఉండే వర్షాకాలంలో శిలీంద్ర కాలుష్యం (Fungal infection) ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తుంది. మాయిశ్చర్ ఉన్న చోట చట్నీలు, సాసులు, బ్రెడ్ వంటి పదార్థాల్లో ఫంగస్ త్వరగా పెరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు , అలర్జీలు వస్తాయి. ముఖ్యంగా అపరిశుభ్రంగా ఉన్న మష్రూమ్స్ తినడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.
పిల్లలకు ఎందుకు ప్రమాదం?.. పిల్లలు ఎక్కువగా పానీ పూరి, నూడిల్స్, ఫ్రై చేసిన పదార్థాలు, రోడ్డు పక్కన అమ్మే ఐస్ క్రీములను ఇష్టపడతారు. పిల్లల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, వర్షాకాలంలో ఈ ఆహారాలు తీసుకుంటే వారు త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. వర్షాకాలంలో బయట వండిన పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇది పిల్లల్లో నీరసానికి, డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి పెద్దలు పిల్లలకు బయట ఆహారం ఇవ్వకుండా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే అందించాలి.
ఈ పదార్థాలను పొరపాటున కూడా కొనకండి.. వర్షాకాలంలో రోడ్డు పక్కన అమ్మే పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకోకండి. అవి ఎంత శుభ్రం చేసినా, అందులోని బ్యాక్టీరియా పూర్తిగా నశించకపోవచ్చు. అలాగే, తొక్క తీయకుండా కోసిన పండ్లు కూడా ప్రమాదకరం.. అవి సరిగ్గా కడగకపోతే బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. రోడ్డు పక్కన అమ్మే ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ కూడా హానికరం, ఎందుకంటే అవి తయారుచేసే నీరు కలుషితమైతే హెపటైటిస్ ఏ వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇడ్లీ, దోస వంటి వంటకాలతో పాటు ఇచ్చే చట్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తేమ వల్ల వాటిలో బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు.. బయట ఆహారం కంటే ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసుకున్న పదార్థాలే శ్రేయస్కరం. ఇంట్లోనే వేడివేడిగా ఇడ్లీలు, దోస, ఉడకబెట్టిన గుడ్లు, రోస్ట్ చేసిన మొక్కజొన్న, పకోడీలు లేదా నూడిల్స్ వంటివి తయారు చేసుకుని తీసుకోవడం మంచిది.
పరిశుభ్రమైన ఆహారాన్ని ఎలా గుర్తించాలి?.. ఒకవేళ మీరు బయట తినాల్సి వస్తే, ఆ ప్రాంతం పరిశుభ్రంగా ఉందో లేదో గమనించండి. చుట్టుపక్కల నీరు, చెత్త లేకుండా చూసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ఆహారం కాకుండా, తాజాగా వండిన పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఆహార పదార్థాలపై కవర్లు ఉన్నాయో లేదో చూడండి. వంట చేసే పాత్రలు, ప్లేట్లు, వాడే క్లాత్ పరిశుభ్రంగా ఉన్నాయా అని గమనించండి. బయట తిన్నప్పుడు సొంత వాటర్ బాటిల్ వాడటం ఉత్తమం. ఆహారం తినే ముందు చేతులను సోపు లేదా హ్యాండ్ వాష్‌తో తప్పనిసరిగా శుభ్రం చేసుకోండి. అలాగే, అతిగా స్వీట్ లేదా స్పైసీగా ఉండే ఫ్రై చేసిన పదార్థాలను తగ్గించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.