సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్'. ఇందులో దీపా థామస్ హీరోయిన్ గా నటించింది.
వెంకటేష్ మహా ఈ మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, వరల్డ్ ఆఫ్ రావు బహదూర్ వీడియో, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మహేష్ ఈ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చారు.మహేష్ బాబు ఇటీవలే 'రావు బహదూర్' సినిమాని చూశారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ''రావు బహదూర్... ఇది మిమ్మల్ని కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు, మీ చర్మంలోకి చొచ్చుకుపోయే సినిమా కూడా!!! విచిత్రంగా, అందంగా, ఇంటెన్స్ డ్రామాతో ఉంటుంది. వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.. సత్యదేవ్ తనదైన శైలిలో ఆ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు!!! దీపా థామస్ తన అద్భుతమైన నటనతో మెరిసింది.. అద్భుతమైన నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక బృందం కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి టీమ్ ని చూసి చాలా గర్వంగా ఉంది. జూలై 3వ తేదీ నుండి వెండితెరపై రావుబహదూర్ ను, అతని మ్యాడ్ నెస్ ని చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని మహేష్ పేర్కొన్నారు.మహేష్ బాబు పోస్టుపై హీరో సత్యదేవ్ స్పందిస్తూ, సంతోషం వ్యక్తం చేశారు. ''మన ప్రియమైన గ్లోబ్‌ట్రాటర్.. కాస్త సమయం కేటాయించి 'రావు బహదూర్' సినిమా కోసం ఈ అద్భుతమైన రివ్యూని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కొన్ని ప్రశంసలు మనతో శాశ్వతంగా నిలిచిపోతాయి. థ్యాంక్యూ మహేష్ సర్, మీ మాటలు ఈ ప్రయాణాన్ని మరింత మెమరబుల్ గా మార్చాయి. మేము సృష్టించిన ఈ విచిత్రమైన, అందమైన ప్రపంచంతో మీరు కనెక్ట్ అవ్వడం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సినిమా విడుదలకు ముందు మీ మాటలు మా బృందం మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని అందించాయి. మా ఈ మ్యాడ్నెస్ ని ఆదరించినందుకు ధన్యవాదాలు సర్. ఇది మాకు సర్వస్వం'' అని సత్యదేవ్ రాసుకొచ్చారు.‘రావు బహదూర్’ సినిమాపై మహేష్ బాబు రివ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ చెప్పాడంటే, కచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్, డార్క్ కామెడీ.. ఇలా పలు జానర్స్ మిక్స్ చేసి ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో వచ్చే 51 శుక్రవారాల్లో ఈ సినిమా విడుదలయ్యే శుక్రవారం డిఫరెంట్ గా ఉంటుందని చిత్ర బృందం చెబుతూ వస్తోంది. విదేశాలకు వెళ్లినప్పుడు 'బాహుబలి', 'RRR' సినిమాల గురించి ఎంత గర్వంగా చెప్పుకుంటామో, ఈ సినిమా చూశాక 'రావు బహదూర్' గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటారని సత్యదేవ్ పేర్కొన్నారు. ఇప్పుడు మహేష్ సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ‘రావు బహదూర్’ చిత్రంలో సత్యదేవ్ డిఫరెంట్ గెటప్పుల్లో, వివిధ రకాల లుక్స్ లో కనిపించనున్నారు. దీపా థామస్ తో పాటుగా వికాస్ ముప్పాళ్ల, ఆనంద్ భారతి, బాల పరాశర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. GMB ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. స్మరణ సాయి సంగీతం సమకూర్చగా, కార్తీక్ పర్మర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు.