'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక వెబ్ సిరీస్ కి కటౌట్స్ పెట్టారంటే.. దాని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఇప్పటి వరకూ వచ్చిన మూడు సీజన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో నటించిన నటీనటులకు విపరీతంగా పాపులారిటీ వచ్చింది. విలన్ పాత్ర పోషించిన మున్నా భయ్యాని 'పెద్ది' సినిమాలోకి తీకున్న సంగతి తెలిసిందే.అంతగా జనాల్లోకి వెళ్లిపోయిన ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు సినిమాగా బిగ్ స్క్రీన్ మీదకు రాబోతోంది. ‘ మీర్జాపూర్ ది మూవీ’ అనే పేరుతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.‘మీర్జాపూర్’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు. ''ఈ సెప్టెంబర్‌లో, మీరు మునుపు చూడని వినని ప్రభంజనానికి సిద్ధంకండి'' అంటూ వదిలిన ఈ వీడియో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్రియ పిల్గోంగర్, హర్షితా శేఖర్, రసిక దుగల్, అభిషేక్ బెనర్జీ తదితరులు ఈ మూవీలో కూడా కొనసాగారు. రవి కిషన్ తో సహా మరికొన్ని కొత్త పాత్రలు టీజర్ లో కనిపించాయి. విక్రాంత్ మాస్సీ స్థానంలో జితేంద్ర కుమార్ వచ్చి చేరాడు. ఇది ఈ మూవీలో కీలక మార్పుగా కనిపిస్తోంది. మున్నా భయ్యాగా ఎప్పటిలాగే దివ్యేందు శర్మ అదరగొట్టాడు. అయితే సినిమా కావడంతో బూతులు, రొమాంటిక్స్ సీన్స్ లేకుండా చూసుకున్నారని అర్థమవుతోంది. ఆ విషయంలో మాత్రం 'మీర్జాపూర్' టీజర్ కొంత నిరాశ పరుస్తుంది. ఇందులో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ, కేవలం యాక్షన్ సన్నివేశాలను చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చారు.'మీర్జాపూర్' మూవీకి గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. పునీత్ కృష్ణ కథ అందించగా.. రితేష్ సిద్వాని, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు. వెబ్ సిరీస్ గా ఓటీటీ స్పేస్ లో సంచలనం సృష్టించిన మీర్జాపూర్.. ఇప్పుడు సినిమాగా వెండితెరపై ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.