
Pune fort murder| ఇంటర్నెట్‌డెస్క్: పుణె బిజినెస్‌మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది (Ketan Agarwal Murder Case).
కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అలాగే కేతన్‌ను ఎలా చంపాలనేదానిపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌధరీ ఆన్లైన్లో వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ముందునుంచి ఈ వివాహం చేసుకోవడం సియాకు ఇష్టం లేదని తెలుస్తోంది. తన అయిష్టతను కుటుంబ సభ్యులకు తెలియజేసినా.. వారి ఒత్తిడి మేరకు చివరకు ఆమె పెళ్లికి అంగీకరించిందని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరగ్గా... నవంబర్‌లో వివాహం నిశ్చయించారు. ఇక, దర్యాప్తులో భాగంగా సియా ఫోన్ కాల్స్ పరిశీలించగా.. చేతన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు, గంటలకొద్ది కాల్స్ మాట్లాడినట్లు వెల్లడైంది. తర్వాత వారి ఫోన్, ల్యాప్‌టాప్స్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా.. ఒక వ్యక్తిని చంపడానికి ఉన్న మార్గాలను వారు అన్వేషించినట్లు తెలిసింది. నిందితులు ఇంటర్నెట్లో శోధించిన అంశాలు, వారి మధ్య జరిగిన సంభాషణ కేసు దర్యాప్తునకు కీలకమని పోలీసువర్గాలు వెల్లడించాయి. కేతన్ అగర్వాల్ మృతి చెందిన రోజు (Pune fort murder)న లోహగఢ్ కోటకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు సియా, చేతన్ ఒక కేఫ్‌లో కలుసుకున్నారని, హత్య ప్రణాళికను చర్చించుకున్నారని పేర్కొన్నాయి.
ఈ కేసులో నిందితులు ఇద్దరికీ న్యాయస్థానం ఏడురోజుల పోలీసు కస్టడీ విధించింది. గతేడాది నవంబర్ నుంచి సియా-చేతన్ రిలేషన్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. ఈ కేసులో తన కుమారుడిని ఇరికిస్తున్నారంటూ నిందితుడు చేతన్ తండ్రి బాబూలాల్ మీడియా ఎదుట ఆరోపించారు. అసలు సియా ఎవరో తమకు తెలియదని, మీడియా ద్వారానే ఆమె పేరు తొలిసారి తెలిసిందని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో సియా, కేతన్ (Ketan Agarwal Murder Case)కు చాలా దూరంలో నిలబడి ఉన్నట్లు చేతన్ చెప్పాడన్నారు. తనను కాపాడుకోవడానికి సియా తన కుమారుడిని ఇరికిస్తోందని ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా హుడీ ధరించిన వ్యక్తి, చేతన్ ఒకరేనని పోలీసులు ఒక అంచనాకొచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.