
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం గ్రామాల్లో మొదలైన పండుగ సందడి రేపు పీర్ల ఊరేగింపు జగదేవ్పూర్(మెదక్): అసై.. దూల హారతి అంటూ గ్రామాల్లో పీర్ల పండుగ సందడి మొదలైంది.
మొహర్రం సందర్భంగా తెలంగాణ గ్రామాల్లో పీర్లను నిలబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుల, మతాలకతీతంగా హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం స్వగ్రామాలకు చేరుకుని వేడుకల్లో పాల్గొంటున్నారు. అలావా ఆటే ప్రత్యేక ఆకర్షణ. పీర్ల పండుగలో అలావా ఆట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పెద్ద కట్టెలతో వెలిగించిన అలావా చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం ఆనవాయితీ. మూడురోజుల పాటు రాత్రి వేళల్లో గ్రామస్థులు అలావా ఆడుతుండగా, యువత అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. షర్బత్ పంపిణీ సంప్రదాయం.. మొహర్రం సందర్భంగా ఇమామ్ హుస్సేన్ స్మరణార్థం గ్రామాల్లో షర్బత్ పంపిణీ చేస్తున్నారు. కర్బలా ఘటనలో దాహంతో అలమటించిన పరిస్థితి మరెవరికి రాకూడదనే భావనతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. పీర్ల వద్ద, ప్రధాన వీధుల్లో షర్బత్ అందజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. రేపు పీర్ల ఊరేగింపు.. పండుగకు వారంరోజుల ముందే పీర్లను నిలబెట్టి ప్రతిరోజూ అలావా ఆటలు నిర్వహిస్తున్నారు. మొహర్రం రోజున గ్రామమంతా పీర్లతో ఊరేగింపు చేపడతారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 26న పీర్ల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దౌలాపూర్ నిర్వాహకులు బాబా, జాఫర్, డీసీ వెంక టేష్, చాకలి సాయిలు, కుమ్మరి ఎల్లయ్య, బాలయ్య తెలిపారు. ఎనిమిదోరోజు పీర్ల ఊరేగింపు శివ్వంపేట: అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించే మొహర్రం వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. పీర్లను నిలబెట్టి ఎనిమిదిరోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం మండల కేంద్రం శివ్వంపేటలో గూడూరు, శివ్వంపేట ప్రాంతాలకు చెందిన పీర్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని పీర్లకు కుడుక, బెల్లం, పూలదండలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్దుల్ అజీజ్, యాసీన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు కూడా చదవండి: హ్యాకర్స్ కాదు పిల్లల పనే! రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి! Read Latest AP News And Telangana News And International News And Telugu News