
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు వణికించాయి. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కరాకస్‌లోని భవనాలు ఊగిపోయాయి.
దీంతో ప్రజలంతా భయాందోళనతో పరుగులు పెట్టారు. అనేకమంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదు కాగా, రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదైనట్లు యూఎస్ జియోలజికల్ సర్వే తెలిపింది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.
భూకంపం ధాటికి వెనెజువెలా రాజధాని కరాకస్‌లో బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి పలువురికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
వెనెజువెలాను వణికించిన భూకంపం.. తర్వాత జపాన్‌నూ తాకింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. హొన్షు ఐలాండ్‌లోని ఐవాటె ప్రిఫెక్చర్ సమీపంలో 50కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అక్కడి నుంచి వందల కిలోమీటర్ల వరకు ప్రకంపనల తీవ్రత కనిపించిందని జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. షింకాసెన్ బుల్లెట్ ట్రైన్ సర్వీసులను మాత్రం ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ దేశంలో ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ కాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.