
ఇంటర్నెట్ డెస్క్: వేదికపై మాట్లాడాలంటే ప్రస్తుతం తాను సంకోచిస్తున్నట్లు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ చెప్పారు. ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశిఖన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. నేడు ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ‘ధర్మన్’ (Dharman) పేరును ఖరారు చేశారు.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్ (Rajinikanth) మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి పిలవగానే మాట్లాడటానికి ప్రస్తుతం సంకోచిస్తున్నాను. నేను ఏం మాట్లాడినా.. అదో సమస్య అవుతోంది. అది నాతో పాటు ఇతరులకూ ఇబ్బంది కలిగిస్తోంది. మాట్లాడకపోతే.. ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతారు. మాట్లాడితే, ఇప్పుడే ఎందుకని అంటారు. మౌనంగా ఉండొచ్చు కదా అని మరికొందరు సూచిస్తారు. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా నచ్చదని.. ఇవన్నీ విన్నాక నాకు అర్థమైంది’’ అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్‌కు అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడని రజనీకాంత్ తెలిపారు. దీని వెనక కారణాన్ని వివరించారు. ‘‘మొదట ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు రవికుమార్‌తో చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత సుందర్‌ని ఎంపిక చేశాం. ఆయనకు ఇతర ప్రాజెక్టులు ఉండడంతో వైదొలిగారు. ఆ తర్వాత శిబి చక్రవర్తిని ఖరారు చేశాం. ఆయన మాకు వేరే కథ వినిపించారు. చివరకు అశ్వత్తో సినిమాను ఖరారు చేశాం’’ అని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ (Kamal Haasan) మాట్లాడుతూ.. రజనీతో కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ‘‘ఒకప్పుడు ఏవీఎం స్టూడియోలోని వేప చెట్టు కింద కూర్చున్న ఇద్దరు యువకులు ఇంత దూరం ప్రయాణించడం గర్వంగా ఉంది. మేం విజయం సాధిస్తామని కచ్చితంగా నమ్మి ముందుకు సాగాం. కానీ ఈ స్థాయిలో అగ్రకథానాయకులుగా మారతాం అని ఊహించలేదు. సాధారణంగా, సినిమా పనుల్లో హీరో రిలాక్స్డ్గా ఉంటే, నిర్మాత హడావుడి చేస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రజనీకాంత్ ఎవరినీ నిద్రపోనివ్వడం లేదు. ప్రకటించిన నాటి నుంచి ఆయన అందరికీ ఫోన్ చేసి, తాను కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్నానని చెబుతూనే ఉన్నారు’’ అని కమల్ సరదాగా చెప్పారు.
ఈ సినిమా ప్రకటించగానే రజనీకాంత్ తనకు ఓ వాయిస్ నోట్ పంపారని దర్శకుడు తెలిపారు. మనం ఎలా అయినా కచ్చితంగా హిట్ కొట్టాలని చెప్పారన్నారు. ‘‘ఒక స్టార్ హీరో నిర్మిస్తున్న సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో 8 పాటలు ఉంటాయి. అన్నీ భిన్నంగా అనిపిస్తాయి’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.