
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. స్టీరింగ్ మీద ఉన్న ఒక బటన్ నొక్కగానే కార్ నంబర్ ప్లేట్ మారిపోయే మ్యాజిక్ లాంటి సీన్ ఆ వీడియోలో ఉంది. ఇది చూసి జనాలు షాక్ అవుతున్నారు.
కట్ చేస్తే, సరిగ్గా ఇదే టైమ్‌లో మన దేశంలో ఫేక్, ట్యాంపర్డ్ నంబర్ ప్లేట్లపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.
రీసెంట్గా హైదరాబాద్‌లో పోలీసులు ‘ఆపరేషన్ కవచ్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నంబర్ ప్లేట్లను మార్చిన, ఫేక్ నంబర్లు వాడుతున్న 2,100 పైగా వాహనాలను సీజ్ చేశారు. ఒకే నంబర్‌ను వేర్వేరు బండ్లకు వాడటం, క్లోనింగ్ చేయడం లాంటి ఫ్రాడ్స్ బయటపడ్డాయి. రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్‌తో ఆటలాడితే క్రిమినల్ యాక్షన్ తప్పదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు నంబర్ ప్లేట్ అంటే ఏంటి? దీని కథ ఎప్పుడు ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.
మోటార్ వాహనాల చట్టం (Motor Vehicles Act), 1988 లోని సెక్షన్ 41(6) ప్రకారం.. ఒక వాహనానికి ఇచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రవాణా శాఖ ఇచ్చే అధికారిక గుర్తింపు. దీన్ని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కేటాయిస్తారు. ఇండియాలో రోడ్లపై తిరిగే ఏ వాహనానికైనా ఇదే లీగల్ ఐడెంటిటీ. సెక్షన్ 39 ప్రకారం.. వాలిడ్ రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా బండి నడపడం చట్టరీత్యా నేరం. వాహనానికి ముందు, వెనుక వైపులా ఈ నంబర్ స్పష్టంగా కనిపించాలని రూల్ చెబుతోంది.
మన దేశంలో నంబర్ ప్లేట్ ఫార్మాట్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు “TN 06 AB 1234” అనే నంబర్ ఉందనుకుందాం. ఇందులో మొదటి రెండు అక్షరాలు (TN) బండి ఏ స్టేట్‌లో రిజిస్టర్ అయిందో చెప్తాయి. ఆ తర్వాత వచ్చే రెండు అంకెలు (06) ఆ రాష్ట్రంలోని ఆర్టీవో లేదా జిల్లా ఆఫీస్‌ను సూచిస్తాయి. మధ్యలో ఉండే ఆల్ఫాబెట్స్ (AB) ఆ నంబర్ ఏ సిరీస్‌లో వచ్చిందో చెప్తాయి. చివరలో ఉండే నాలుగు అంకెలు (1234) ఆ బండికి మాత్రమే కేటాయించిన యూనిక్ నంబర్. ఇప్పుడు ఇదంతా కంప్యూటరైజ్డ్ కాబట్టి మోసాలు చేయడం అంత ఈజీ కాదు.
ప్రపంచంలోనే మొదటిసారిగా ఫ్రాన్స్ దేశం వాహనాలకు గుర్తింపు ప్లేట్లను ప్రవేశపెట్టింది. ఆగస్టు 14, 1893న ప్యారిస్ పోలీసులు ఈ రూల్ తెచ్చారు. రోడ్డు ప్రమాదాలు చేసి పారిపోయే వాహనాలను పట్టుకోవడానికి ఇది స్టార్ట్ అయింది. అప్పట్లో నంబర్‌తో పాటు ఓనర్ పేరు, అడ్రస్ కూడా ప్లేట్ మీద రాయాల్సి వచ్చేది. ఆ తర్వాత 1896లో జర్మనీ, 1898లో నెదర్లాండ్స్ ఈ పద్ధతిని నేషనల్ వైడ్‌గా అడాప్ట్ చేసుకున్నాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో 1901లో నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేశారు. కాకపోతే అప్పట్లో ఓనర్లే లెదర్ లేదా మెటల్ మీద నంబర్లు రాసుకునేవారు. 1903లో మాసచుసెట్స్ స్టేట్ మొదటిసారి అధికారిక ప్లేట్లను ఇచ్చింది.
బ్రిటిష్ కాలంలో 1914 నాటి ఇండియన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ద్వారా ఇండియాలో ఈ సిస్టమ్ అధికారికంగా వచ్చింది. కానీ, అంతకంటే ముందే బాంబే (1901), బెంగాల్ (1903), మద్రాస్ (1907), పంజాబ్ (1907), బర్మా (1906) వంటి ప్రావిన్సుల్లో లోకల్ రూల్స్ ఉండేవి. వాహనాలు పెరిగిపోవడంతో 1939లో ఒక పక్కా సిస్టమ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత 1988 మోటార్ వెహికల్ యాక్ట్, 1989 సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న యూనిఫాం స్టేట్ కోడ్స్ సిస్టమ్ అమలులోకి వచ్చింది.
ఇప్పుడు నంబర్ ప్లేట్లలో చాలా రకాల కలర్స్ వచ్చాయి. ప్రైవేట్ వాహనాలకు తెల్లటి ప్లేట్ పై నల్లటి అక్షరాలు, కమర్షియల్ బండ్లకు పసుపు ప్లేట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఆకుపచ్చ ప్లేట్ వాడుతున్నారు. ఫ్రాడ్స్ జరగకుండా క్రోమియం బేస్డ్ హోలోగ్రామ్స్, లేజర్ కోడ్స్‌తో కూడిన 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు' (HSRP) తెచ్చారు. ఇక 2021లో 'BH' అంటే భారత్ సిరీస్ తీసుకొచ్చారు. దీనివల్ల ఉద్యోగాల రీత్యా వేరే రాష్ట్రాలకు బదిలీ అయ్యేవాళ్లు పదే పదే బండిని రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటి ప్యారిస్ పోలీసుల రూల్ నుండి నేటి డిజిటల్ సిస్టమ్ వరకు నంబర్ ప్లేట్ల ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది.