
ఇరాక్‌పై రెండు గోల్స్ కొట్టిన స్టార్ నాకౌట్లో ఫ్రాన్స్ ఫిలడేల్ఫియా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె జోరు కొనసాగుతోంది. అదిరే ఆటతో అతడు మరోసారి గోల్స్ మోత మోగించాడు.
ఎంబాపె రెండు గోల్స్ కొట్టడంతో మంగళవారం గ్రూప్-ఐ పోరులో ఫ్రాన్స్ 3-0తో ఇరాక్‌ను మట్టికరిపించింది. గ్రూపులో వరుసగా రెండో విజయంతో ఆ జట్టు ప్రపంచకప్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. కెరీర్లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఎంబాపె తన ప్రపంచకప్ గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్నాడు. మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. జర్మనీ దిగ్గజం మిరస్లావ్ క్లోజ్ (16) సరసన అతడు నిలిచాడు. అర్జెంటీనా స్టార్ మెస్సి (18) మాత్రమే ఎంబాపె కన్నా ముందున్నాడు. ఫ్రాన్స్ తరఫున నమోదైన మరో గోల్‌ను డెంబెలె సాధించాడు. మ్యాచ్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఫ్రాన్స్.. నిరంతరాయంగా ఇరాక్ గోల్‌పై దాడులు చేసింది. ఇరాక్ మాత్రం ఒక్కసారి కూడా టార్గెట్‌పై దాడి చేయలేకపోయింది. మ్యాచ్ ఆసాంతం ఆ జట్టుకు.. దూకుడు మీదున్న ఫ్రాన్స్ ఆటగాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నించడమే సరిపోయింది. తొలి అర్ధభాగం ముగిసిన తర్వాత వర్షం మొదలైంది. వాన, ఉరుముల వల్ల రెండు గంటలు ఆలస్యంగా ద్వితీయార్ధం ఆరంభమైంది.
అతడి జోరు: ఫ్రాన్స్ తొలి మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో చెలరేగిన 27 ఏళ్ల ఎంబాపె ఇరాక్‌పైనా సత్తా చాటాడు. మూడో ప్రపంచకప్ ఆడుతున్న అతడు.. 14వ నిమిషంలోనే తన జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. బాక్స్ అంచు నుంచి అతడు ఎడమకాలితో బంతిని నెట్లోకి కొట్టాడు. ఎంబాపె 54వ నిమిషంలో ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. డిఫెండర్ జైద్ తెహ్సీన్ తప్పిదానికి ఇరాక్ మూల్యం చెల్లించుకుంది. జైదీ పేలవ పాస్ గోలీకీపర్కు అందకుండా పోయింది. బంతిని నియంత్రించిన డెంబెలె.. దాన్ని ఎంబాపెకు అందించగా అతను గోల్ కొట్టాడు. ఆ తర్వాత డెంబెలె గోల్‌తో 66వ నిమిషంలో ఫ్రాన్స్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఒలిసె నుంచి వచ్చి పాస్‌ను అతడు గోల్‌లోకి కొట్టాడు.
నార్వే కూడా ముందుకు..: గ్రూప్-ఐలో ఫ్రాన్స్‌తో పాటు నార్వే నాకౌట్లో ప్రవేశించింది. నార్వే కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3-2తో సెనెగల్పై విజయం సాధించింది. ఎర్లింగ్ హాలెండ్ రెండు గోల్స్‌తో నార్వే గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడు 48, 58వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. ఇరాక్‌తో మ్యాచ్‌లోనూ హాలెండ్ రెండు గోల్స్ చేయడం గమనార్హం. నార్వే తరఫున నమోదైన మరో గోల్‌ను పెడర్సన్ సాధించాడు. సెనెగల్ జట్టులో ఇస్మాలియా (53వ, 90+3వ) రెండు గోల్స్ చేశాడు. నార్వేతో పోలిస్తే బంతిని ఎక్కువ తన నియంత్రణలోనే ఉంచుకున్నా, ఎక్కువ దాడులు చేసినా.. సెనెగల్ గోల్స్‌లో వెనుకబడిపోయింది.
జోర్డాన్‌పై అల్జీరియా విజయం: గ్రూప్-జెలో జరిగిన మ్యాచ్‌లో అల్జీరియా 2-1తో జోర్డాన్‌పై విజయం సాధించింది. అల్జీరియా తరఫున నాధిర్ బెన్బౌలి (69వ) అమిన్ గోరి (82వ) చెరో గోల్ కొట్టగా.. జోర్డాన్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను నిజార్ సాధించాడు. ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అల్జీరియా.. బంతిని ఎక్కువసేపు తన నియంత్రణలోనే ఉంచుకుంది. 17 సార్లు ప్రత్యర్థి గోల్‌పై దాడి చేసింది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన అల్జీరియా.. తాజా విజయంతో నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
స్విట్జర్లాండ్ × కెనడా అర్ధరాత్రి 12.30 నుంచి
బ్రెజిల్ × స్కాట్లాండ్ అర్ధరాత్రి 3.30 నుంచి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.