
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నేషనల్ అవార్డు విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ (Peddi). బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్‌ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ (Peddi Blockbuster Event)ని మేకర్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఒక తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్ యాక్టర్‌గా చెప్పాలంటే... యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్మెంట్.. ఇలా ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం తెరపై చూపించిన రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం. అలాంటి పాత్ర మళ్లీ రావాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నాం. ‘మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. కానీ మూడేళ్ల వ్యవధిలోనే చరణ్‌కు ‘పెద్ది’ వంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం. సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు.. ‘పెద్ది’ మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా అంతగా ఒంటబట్టించుకున్నాడు. దర్శకుడికి ఏం కావాలో దానిని అంకితభావంతో ఇచ్చాడు. పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు.. ఫైనల్‌గా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.
కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నటుడిగా నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. నిజంగా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసుకుని వెళ్లిపోవచ్చు. కానీ అతను కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. నిజంగా అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. అవార్డు రావాల్సిన అవసరం లేదు.. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి. కానీ ప్రజల మనసుల్లో 'అద్భుతంగా నటించాడు' అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదని నేను భావిస్తున్నాను. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు. ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు.. అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయమై రక్తం కారుతోంది. ఆ ఫొటో నాకు పంపించారు. అది చూసి నేను చాలా భయపడ్డాను. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డాయి. అయినా వెనక్కి తగ్గలేదు.
ఆ సమయంలో నాకు ‘గూండా’ సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్న చాలా భయపడ్డారు. అప్పుడు నేను ‘ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే’ అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు.. ‘నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది’ అని అన్నారు. చరణ్‌కి గాయమైనప్పుడు నాన్న మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.
‘పెద్ది’ పోరాటంలో నేనూ ఒకడినై.. ప్రయాణించా: చిరంజీవి
పారితోషికం పెంచను.. నాకంటూ ఒక రోజు వస్తుంది: ఐశ్వర్య లక్ష్మి
నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే