
AP Rain Alert : ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే, తాజాగా.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికితోడు రుతుపవనాల విస్తరణ కొద్దిరోజులుగా మందగించింది. అయితే, తాజాగా.. నైరుతి రుతుపవనాల విస్తరణలో వేగం పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ (బుధవారం) రాష్ట్రంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈనెల 25వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్నాయి. ముఖ్యంగా జూన్ 26, 27 తేదీల్లో ఉత్తర కోస్తా, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో 27వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ 26వ తేదీ వరకు వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.