
ఈ రోజుల్లో అమ్మాయిలు లోకోపైలట్ కావడం సాధారణమైన విషయమే కావచ్చు.. కానీ జీవితం విసిరే కఠినమైన సవాళ్లను దాటుకొని ఈ కేంద్ర ప్రభుత్వోద్యోగం సంపాదించడమంటే కచ్చితంగా అది విశేషమనే చెప్పాలి.
అలా తన విజయంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన కల్పనా ప్రజాపతి.
ఈ రోజుల్లో అమ్మాయిలు లోకోపైలట్ కావడం సాధారణమైన విషయమే కావచ్చు.. కానీ జీవితం విసిరే కఠినమైన సవాళ్లను దాటుకొని ఈ కేంద్ర ప్రభుత్వోద్యోగం సంపాదించడమంటే కచ్చితంగా అది విశేషమనే చెప్పాలి. అలా తన విజయంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన కల్పనా ప్రజాపతి. పుట్టుకతోనే తల్లిని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో తండ్రిని కోల్పోయిన ఆమె.. కడు పేదరికాన్ని అనుభవించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్నీ దాటుకొని లక్ష్యం వైపే అడుగేసింది. ఫలితంగా ఇటీవలే అసిస్టెంట్ లోకోపైలట్‌గా నియామక పత్రం అందుకున్న ఆమె.. తాజాగా తన తొలి ట్రయల్ రన్ పూర్తిచేసింది. ‘సాధించాలన్న సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండద’ని తన విజయంతో నిరూపించిన కల్పన స్ఫూర్తి కథ ఇది!
మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణానికి ఆనుకొని ఉన్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది కల్పన. ఆమె పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లి చనిపోయింది. అప్పుడు తన బామ్మే ఆమెను అమ్మలా సాకింది.. ప్రేమగా పెంచి పెద్ద చేసింది. అయితే కడు పేదరికం మధ్య పెరిగినా తండ్రి ప్రోత్సాహంతో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసింది కల్పన. ఉన్నత చదువు, ప్రభుత్వోద్యోగంతోనే తమ జీవితాలకు మంచి రోజులొస్తాయని భావించిన ఆమె.. చదువులో మెరుగ్గా రాణించేది.
‘చిన్నప్పట్నుంచీ ప్రభుత్వోద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలోనే చదువు సాగించా. పలు పోటీ పరీక్షలూ రాశా. అయితే 2024లో ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నా. సరిగ్గా పరీక్షకు రెండు రోజులుందనగా మా నాన్న విద్యుత్ షాక్‌తో చనిపోయారు. దాంతో నా జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లనిపించింది. ఇప్పటికే అమ్మ లేదు.. నాన్నను కూడా కోల్పోవడంతో నా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఈ బాధతో పరీక్షకు కూడా హాజరు కాలేకపోయా. పైగా కుటుంబాన్ని పోషించే నాన్న దూరమవడంతో ఆ బాధ్యత నాపై పడింది. దాంతో నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడి స్థానిక గ్రంథాలయంలో పనిలో చేరా. అక్కడ ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేదాన్ని..’ అంటూ తన జీవితంలో ఎదురైన గడ్డు పరిస్థితుల గురించి చెబుతోంది కల్పన.
అయితే ఎన్ని కష్టాలొచ్చినా, జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా తన ప్రభుత్వోద్యోగ కలను మాత్రం వదులుకోకూడదనుకుంది కల్పన. ఈ పట్టుదలకు తోడు తన బామ్మ, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తదుపరి ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. దీంతో రేవాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరింది.
‘ఈ కళాశాలలోని ఓ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రోత్సాహంతో రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా. దానికి సంబంధించిన పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించా. ఇటీవలే ఈ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రం అందుకున్నా. ఆగ్నేయ మధ్య రైల్వే పరిధిలోని బిలాస్పూర్ రైల్వే డివిజన్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు.. ఈ రోజు మా అమ్మానాన్నలే బతికుంటే ఎంత సంతోషించేవారో..’ అంటూ ఎమోషనల్ అవుతోన్న కల్పన.. తాజాగా తన తొలి ట్రయల్ రన్ని పూర్తి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఇలా తన మనవరాలి విజయంతో కల్పన బామ్మ, ఇతర కుటుంబ సభ్యులు సైతం సంతోషంలో మునిగిపోయారు. తన తల్లిదండ్రులు దూరమైనా, పేదరికం అడ్డుపడాలని చూసినా.. అన్నింటినీ దాటుకొని తన కలల ఉద్యోగాన్ని సొంతం చేసుకున్న కల్పన కథ.. ‘సాధించాలన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే’ అన్న విషయాన్ని రుజువు చేస్తోంది.. తద్వారా నేటి యువతలో స్ఫూర్తి నింపుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.