‘ పద్మ అవార్డ్స్ - 2026’ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక...
‘ పద్మ అవార్డ్స్ - 2026’ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడతలో దివంగత నటుడు ధర్మేంద్ర, ఎన్.రాజంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం 'పద్మ విభూషణ్' ప్రధానం చేయగా.. ఇప్పుడు ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ లకు పద్మవిభూషణ్ అందజేశారు.మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టికి 'పద్మ భూషణ్' అవార్డును ప్రధానం చేశారు. అలానే ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్తో పాటు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. రెండో విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. వీరితో పాటు సినీ హీరో ఆర్. మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రధానం చేశారు.2026 సంవత్సరానికి గాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాణిజ్యం-పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం- విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రకటించారు. ఈ ఏడాది 113 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేశారు. తొలి దఫాలో 66 మందికి పురష్కారాలు అందించగా.. మిగిలిన వారికి నేడు ప్రదానం చేశారు.పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు పాల్గొన్నారు.