Tata Mutual Fund : దేశంలో చాలా మంది పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా ఇవి దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తాయని చెబుతుంటారు.
ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగానే లాంగ్ రన్లో సంపద విపరీతంగా పెరుగుతుందని చెబుతుంటారు. ఇక స్టాక్ మార్కెట్లలో ఐపీఓల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్లలో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) ఉంటుంది. ఐపీఓ అంటే ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా పబ్లిక్ లిస్టింగ్ అవుతుంది. ఇదే ఎన్ఎఫ్ఓ అంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్త స్కీమ్ లాంఛ్ చేయడం. ఇక్కడ కూడా ముందుగా కొన్ని రోజుల పాటు సబ్స్క్రిప్షన్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ కేవలం రూ. 10 NAV తోనే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. తర్వాత మళ్లీ కొద్దిరోజులకు రెగ్యులర్‌గా అందుబాటులోకి తీసుకొస్తాయి.ఇప్పుడు దేశంలో దిగ్గజ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఒకటైన టాటా మ్యూచువల్ ఫండ్ సోమవారం రోజు (జూన్ 22) టాటా మల్టీ సెక్టార్ పాసివ్ FoF ను లాంఛ్ చేసింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ రకం పథకం. ఇది ప్యాసివ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇంకా పాసివ్ సెక్టార్ ఓరియెంటెడ్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి అందించాలన్న ఉద్దేశంతో ఆయా పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ టాటా స్కీమ్ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. జులై 6న ముగుస్తుంది. కొద్ది రోజుల విరామం తర్వాత జులై 14న నిరంతర క్రయవిక్రయాలు, లావాదేవీల కోసం రీఓపెన్ అవుతుంది. ఈ పథకం పనితీరుకు కొలమానంగా నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ ఉంది. రిస్క్ ఫ్యాక్టర్ ఇక్కడ వెరీ హై కేటగిరీలో ఉంది. ఈ ఫండ్ మేనేజర్‌గా రాహుల్ సింగ్ వ్యవహరించనున్నారు. కనీస పెట్టుబడి విషయానికి వస్తే కనీసం ఇందులో రూ. 5 వేలతో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆపై గరిష్ఠంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జిట్ లోడ్ ఇక్కడ 30 రోజుల్లోపు విత్‌డ్రా చేసుకుంటే 0.50 శాతం ఛార్జీ పడుతుంది. ఆ తర్వాత అయితే ఎలాంటి ఛార్జీల్లేవు. ఈ స్కీమ్ మార్కెట్ ట్రెండ్స్, ఆయా రంగాలు ప్రదర్శించే మొమెంటం ఆధారంగా తన పెట్టుబడుల్ని మారుస్తుంటుంది. ఇది నిర్దిష్టంగా ఒకే రంగంపైన ఆధారపడకుండా వివిధ రంగాల (బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ ఇలా) చక్రాల్ని బట్టి దీర్ఘకాలంలో లాభాలు పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. Disclaimer: పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.