తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను...
తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. మొత్తం 33 జిల్లాల్లో భారీ సంఖ్యలో 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 3100 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండగా.. 12,882 అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలను పక్కాగా గుర్తించి, జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మల్టీజోన్-1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్-2పరిధిలోని 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి.ఈ నియామక ప్రక్రియ ఇప్పటికే వేగం పుంజుకుంది. పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టుల భర్తీకి.. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి మొత్తం 177 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అధికారిక ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో స్థానిక అవసరాలకు అనుగుణంగా వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వాస్తవానికి ఈ పోస్టులను భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే ప్రభుత్వం భావించినప్పటికీ, నియామక విధానంలో పారదర్శకత కోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీసు నిబంధనలపై సుదీర్ఘ అధ్యయనం చేసింది. తుది నివేదికల ఆధారంగా అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేలా సరికొత్త నియామక నిబంధనలను ఖరారు చేసింది.కొత్తగా ఇంటర్వ్యూ విధానం..కేంద్ర ప్రభుత్వ సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈసారి విద్యా అర్హతల్లో కీలక మార్పులు చేసింది. గతంలో ఉన్న అర్హతలను సవరిస్తూ.. అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్‌ను కనీస విద్యార్హతగా తప్పనిసరి చేసింది. దీంతో పాటు ఎంపిక ప్రక్రియలో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఎంపిక విధానంలో ఇంటర్వ్యూలకు అనుమతిస్తూ జీవో నంబర్ 4, మార్కుల వెయిటేజీని ఖరారు చేస్తూ జీవో నంబర్ 6 ను ప్రభుత్వం జారీ చేసింది.అర్హతలు- ఎంపిక విధానం..అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో ఖచ్చితంగా స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లోని పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు. అలాగే ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలకే అవకాశం కల్పిస్తారు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ ఇంటర్వ్యూ రౌండ్‌కు 10 మార్కులు కేటాయించారు. సహాయకుల పోస్టులకు కూడా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి, అయితే ఒకవేళ ఇంటర్ చదివిన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో మాత్రమే పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.మొత్తం ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ప్రతిభకు, సామాజిక స్థితికి ప్రాధాన్యతనిస్తూ వెయిటేజీని ఇచ్చారు. ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులకు 70 శాతం వెయిటేజీ, వితంతువులకు 5 శాతం వెయిటేజీ, అనాథలకు 10 శాతం వెయిటేజీ, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ, ముఖాముఖి పరీక్షకు 10 మార్కుల వెయిటేజీ ఇచ్చారు.