
Chittem Ram Mohan Reddy | నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి మక్తల్ – నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని...
Chittem Ram Mohan Reddy | నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు నుంచి మక్తల్ – నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మాగనూరు పెద్దవాగు ఇసుక తవ్వకాలతో ఎడారిని తలపించే పరిస్థితి ఏర్పడిందని, గ్రామస్తులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని విమర్శించారు. ప్రజల నిరసనలను పట్టించుకోకుండా ఇసుక తరలింపు కొనసాగుతుండటంతో తాము స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అక్రమ ఇసుక రవాణాకు కొందరు అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించిన ఆయన, రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. అధికారులు ప్రభుత్వ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని చిట్టెం ప్రశ్నించారు. మరోవైపు స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి అండదండలతో కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలిస్తూ కొందరు నేతలు అక్రమ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రజాపాలనలో ప్రతిపక్ష నేతలకు కూడా భద్రత కరువైందని విమర్శించారు.
రాష్ట్ర మంత్రులు అక్రమార్జనే ధ్యేయంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రస్తుతం కరువు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇసుక వినియోగం జరగాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ‘మన ఇసుక–మన వాహనం’నిబంధనల మేరకు ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టబద్ధంగా ఇసుక వినియోగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి, మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, మాగనూరు, కృష్ణ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, శివరాజ్ పాటిల్, ఈశ్వర్ యాదవ్, నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్ Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు