
పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి వాటితో పోల్చి చూసినా, ఈ విశాల పెట్టుబడుల ప్రపంచంలో మ్యూచువల్ ఫండ్లు ప్రముఖపాత్రే పోషిస్తున్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో కూడా అనేక రకాలున్నాయి.
మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడిదారుల నుంచి డబ్బును సమీకరించి, స్టాక్స్, బాండ్లు వంటి విభిన్న కేటగిరీల్లో పెట్టుబడి పెడతాయి. ఇవి లిక్విడిటీ, ఫ్లెక్సిబిలిటీ, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ను అందిస్తాయి. ప్రత్యేకంగా, ELSS మ్యూచువల్ ఫండ్లు ఈక్విటీలపై దృష్టి సారించి పన్ను ఆదా సౌకర్యాన్ని అందిస్తాయి. మీరు కొత్తవారైనా లేదా అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులైనా, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ELSS ప్రధాన విషయాలను అర్థం చేసుకోవడం మంచిది.
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీం(ELSS)..ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల మాదిరిగానే, ప్రధానంగా స్టాక్స్, ఈక్విటీ-సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ఇంకా ఇది ఈక్విటీలపై ప్రత్యేక దృష్టి సారించే, అదనపు పన్ను ప్రయోజనాలను అందించే ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్లు ఈక్విటీ మార్కెట్లలో గణనీయమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు డివిడెండ్లను కూడా అందిస్తాయి. తద్వారా పెట్టుబడిదారులు క్రమానుగత ఆదాయం పొందే అవకాశముంటుంది. అయితే, డివిడెండ్లకు హామి ఉండదు. డివిడెండ్ రావడం ఫండ్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీ పెట్టుబడులు 3 సంవత్సరాల పాటు లాక్-ఇన్ పీరియడ్లో ఉంటాయి. అంటే, ఈ సమయంలో మీరు ఈ పెట్టుబడులను మీ ఖాతాలోకి బదిలీ చేయలేరు. కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) లేదా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) వంటి ఇతర పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే, ఈ లాక్-ఇన్ వ్యవధి తక్కువే అని చెప్పొచ్చు.
మ్యూచువల్ ఫండ్లలో ELSS మాత్రమే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులను అందిస్తుంది. దీనిలో మీరు ఎంత మొత్తాన్నైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80C కింద మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు. ఉదాహరణకు, మీకు 30% పన్ను రేటు వర్తిస్తుంటే, మీరు ELSSలో రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే, సుమారుగా రూ. 45,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈక్విటీల వైపు ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల, ఇతర సంప్రదాయ పన్ను ఆదా సాధనాలతో పోలిస్తే ELSS ఫండ్లు అధిక రాబడులకు అవకాశాన్ని అందిస్తాయి. ఈ ఫండ్లపై లాభాలను ఆర్జించడానికి ఆ మాత్రం వ్యవధి ఉండడం సరైందే అని చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్ల వలె ఈఎల్ఎస్ఎస్ ఫండ్లు కూడా SEBI నియంత్రణలోనే పనిజేస్తాయి. ఈ ఫండ్లు ప్రధానంగా ఈక్విటీలలో పెట్టుబడి పెడతాయి. కాబట్టి, డెట్ ఫండ్ల వంటి కొన్ని మ్యూచువల్ ఫండ్ కేటగిరీలతో పోలిస్తే వీటిపై రిస్క్ ఎక్కువగానే ఉంటుంది.
సాధారణ ఈక్విటీ ఫండ్లకు లాక్-ఇన్ ఉండదు, కానీ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ELSSలో ప్రతి పెట్టుబడి/SIPపై మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉన్నందున, ఫండ్ యాజమాన్యం నిర్దిష్ట స్టాక్స్, మొత్తం పోర్ట్ఫోలియో గురించి కూడా దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. తక్షణ ఉపసంహరణ ఒత్తిడి గురించి ఫండ్ యాజమాన్యం ఆందోళన చెందదు. పెద్ద సైజు ఫండ్లతో పోలిస్తే ELSSలో తరచుగా టర్నోవర్ నిష్పత్తులు తక్కువగా ఉంటాయి. దీనిలో కొంత ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. ELSS మ్యూచువల్ ఫండ్లు కూడా చాలా ఈక్విటీ ఫండ్ల కంటే అధిక రాబడులను అందించే సందర్భాలూ ఉన్నాయి. తమ పన్ను భారాన్ని తగ్గించుకోవాలని కోరుకోని వ్యక్తులు కూడా కాలక్రమేణా సంపదను పెంచుకోవడానికి ELSS ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
పైన తెలిపిన లాక్ ఇన్ లాంటి వాటితో పాటు ELSS ఫండ్లలో మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలా వరకు ELSS లో పెట్టుబడులు పన్ను సంవత్సరం చివరిలో ఉంటాయి. కాబట్టి, ఫండ్ మేనేజర్ అదే సమయంలో పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా చేయడం వల్ల మార్కెట్ పడిపోయిన సందర్భంలో ఫండ్ మేనేజర్ వద్ద అదనపు నిధులు ఉండకపోవచ్చు. కాబట్టి, రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే, కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ELSS పన్ను మినహాయింపు వర్తించదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.