
అందరూ ముందడుగు వేయమంటారు. మన నడకా ఎప్పుడూ ముందుకే ఉంటుంది. కానీ వెనక్కి నడవడం వల్ల కూడా ఆరోగ్యానికి, మెదడుకు ఎంతో మేలు చేకూరుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
వెనక్కి నడవడం వల్ల జ్ఞాపకశక్తి, ప్రతిచర్య సమయం, సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగవుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీవయాంత్రిక శాస్త్రం(బయోమెకానిక్స్)లోని వ్యత్యాసం కారణంగా ఈ శారీరక ప్రయోజనాలు సమకూరుతాయి. నడుము నొప్పి, మోకాలి సమస్యలు, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ విధానాన్ని తరచుగా ఫిజియోథెరపీలో ఉపయోగిస్తారు. ఇలా వెనక్కి నడవడాన్ని ‘రెట్రో-వాకింగ్’ అని పిలుస్తారు. క్రీడా ప్రదర్శనను మెరుగుపరచడానికి, కండరాల బలాన్ని పెంచడానికి వెనక్కి నడిచే పద్ధతిని ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో పాటిస్తున్నారు.
వెనక్కి నడవడం వల్ల కండరాల బలం పెరుగుతుందని అమెరికాలోని నెవాడా విశ్వవిద్యాలయంలో బయోమెకానిక్స్ నిపుణురాలైన జానెట్ డ్యూఫెక్ బృందం తేల్చింది. నాలుగు వారాల పాటు రోజుకు 10-15 నిమిషాలు వెనుకకు నడవడం వల్ల 10 మంది ఆరోగ్యవంతులైన విద్యార్థినుల్లో హామ్‌స్ట్రింగ్ (తొడ వెనుక కండరాల) ఫ్లెక్సిబిలిటీ పెరిగినట్లు కనుగొన్నారు. వెన్నెముక స్థిరత్వాన్ని, ఫ్లెక్సిబిలిటీకి బాధ్యత వహించే వీపు కండరాల బలోపేతాన్ని గుర్తించారు. బిగుతుగా ఉండే హామ్‌స్ట్రింగ్ కండరాల వల్ల నడము నొప్పి వస్తుంటుంది. వెనక్కి నడవడం వల్ల తమ నడుము నొప్పి తగ్గినట్లు ఐదుగురు అథ్లెట్లు ఈ బృందానికి స్వయంగా నివేదించారు. బలాన్ని పెంచుతూ మోకాళ్ల కీళ్లపై పడే ఒత్తిడిని తగ్గించడం వల్ల, క్రీడాకారులు గాయాల నుంచి కాపాడుకోవడానికి రెట్రో-రన్నింగ్ ఉపయోగపడుతుంది. వృద్ధులు, యువకులు, ఊబకాయులు, ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు, పక్షవాతం తర్వాత నడకలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఇది ఉపయోగకరం.
వెనక్కి నడిచేటప్పుడు తుంటి, మోకాలి కీళ్ళు రెండింటి వద్ద కదలిక పరిధి బాగా తగ్గిపోతుంది. ముందుకు నడిచేటప్పుడు మడమ నేలను తాకడంతో మొదలవుతుంది. వెనక్కి నడిచేటప్పుడు కాలివేళ్లతో ఆరంభమవుతుంది. కొన్నిసార్లు మడమ అసలు నేలను తాకదు. ఫలితంగా మోకాలి కీలుపై తక్కువ ప్రభావం పడుతుంది. సాధారణ నడకతో పోలిస్తే వెనక్కి నడక వేరే కండరాలను ఉపయోగిస్తుంది. నిజానికి వెనక్కి నడిచేటప్పుడు అత్యధిక కుదుపును గ్రహించేది చీలమండ కీలే. పాదాలను ముందుకు చాచినప్పుడు లేదా కాలి వేళ్లపై నిలబడినప్పుడు ఉపయోగించే ప్లాంటార్ ఫ్లెక్సన్ కదలికలో క్రియాశీలమయ్యే కండరాలు.. వెనక్కి నడిచేటప్పుడు చీలమండ వేగాన్ని తగ్గించడంలో, కుదుపును గ్రహించడంలో ఎక్కువ పాత్ర పోషిస్తాయి. ముందుకు అడుగు వేయడంతో పోలిస్తే వెనక్కి అడుగు వేసేటప్పుడు నాడీ కార్యకలాపాల ప్రదేశంలో తేడాలున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. నిర్ణయం తీసుకోవడం, సమస్య పరిష్కారం వంటి జ్ఞానాత్మక నైపుణ్యాలకు బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వెనక్కి అడుగు వేసేటప్పుడు ప్రత్యేకంగా చురుకుగా ఉంటుంది. వెనక్కి నడిచేవారి ప్రతిచర్య సమయాలు అత్యంత వేగంగా ఉన్నాయని, సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం మెరుగుపడిందని డచ్ అధ్యయనం తేల్చింది. బహుశా వారి మెదళ్ళు అప్పటికే ఓ విరుద్ధమైన పనిని చేయడానికి అలవాటుపడి ఉండటమే దీనికి కారణం కావచ్చు. అయితే వెనక్కి నడవడంలో కొంత ప్రమాదం కూడా ఉంది. ఫిజియోథెరపీ సమయంలో వెనక్కి నడవడం వల్ల కిందపడి తీవ్రమైన గాయాలూ కావొచ్చు. కంటికి కనిపించని అడ్డంకులను తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ప్యాట్రిక్ హార్మన్ అనే ఓ దుకాణ యజమాని 1915 సంవత్సరంలో అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ నగరానికి వెనక్కి నడిచి వెళతానని పందెంకాసి దాదాపు 20 వేల డాలర్లు గెలుచుకున్నాడు. తాను వెళ్లే దారిని చూసుకోవడానికి తన ఛాతీకి కట్టుకున్న కారు అద్దం సహాయంతో 6300 కిలోమీటర్ల దూరాన్ని 290 రోజుల్లో పూర్తిచేశాడు.దీనివల్ల తన చీలమండలు బలపడ్డాయని అప్పట్లో ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.