
పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.
అమరావతి, జూన్ 22: పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈరోజు(సోమవారం) రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలన్నారు. వినూత్న ఆలోచనలతో పని చేసే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. పనితీరు ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలతో వ్యవహరించే సమయంలో సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. దీనివల్ల పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఉద్యోగులు తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. కులం, మతం రంగులు పులిమి.. వాటిని వివాదాస్పద అంశాలుగా సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఫేక్ ప్రచారాల ద్వారా ఉద్యోగులు, అధికారులను బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలను, విద్వేషాలు పెంచే ఘటనలను అదుపు చేసేలా ఉద్యోగులు, అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పుదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి నిందితులను పట్టుకుని శిక్షలు విధిస్తున్నామని తెలిపారు. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి