
అధిపతిగా పీఅండ్ఎల్ విభాగం ఐజీ రవిప్రకాశ్ సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు వెనువెంటనే విచారణ ప్రారంభం విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్,...
అధిపతిగా పీఅండ్ఎల్ విభాగం ఐజీ రవిప్రకాశ్ సభ్యులుగా అల్లూరి, బాపట్ల, పశ్చిమగోదావరి జిల్లాల ఎస్పీలు వెనువెంటనే విచారణ ప్రారంభం విజయవాడ పోలీసుల నుంచి దస్త్రాల స్వాధీనం అర్ధరాత్రి వరకు ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌లతో సమావేశం ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-కృష్ణలంక, అజిత్‌సింగ్‌నగర్
గాదె సాయికృష్ణ అదృశ్యం, తదనంతర పరిణామాలపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసింది. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ (పీఅండ్ఎల్) విభాగం ఐజీ ఎం.రవిప్రకాశ్‌కు సిట్ అధిపతిగా బాధ్యతలు అప్పగించింది. పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ ఎల్.సుధాకర్‌ను సభ్యులుగా నియమించింది. సాయికృష్ణ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, ఆధారాలు మాయం చేయడం, హత్యానేరం తదితర ఆరోపణలపై కృష్ణలంక పూర్వ సీఐ ఎస్.ఎస్.వి.వి.నాగరాజుపై ఇటీవల కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీని దర్యాప్తు బాధ్యతలను సిట్‌కు అప్పగిస్తూ సీఎస్ జి.సాయిప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. దర్యాప్తు కోసం కావాల్సిన సిబ్బందిని, ఫోరెన్సిక్ నుంచి శాస్త్రీయ, సాంకేతిక సహాయాన్ని తీసుకునే అధికారాలను సిట్ అధిపతికి కల్పించారు. కాగా.. సిట్ బృందం ఆదివారమే విజయవాడ చేరుకుంది. బృందంలోని సభ్యుడైన బాపట్ల అదనపు ఎస్పీ సుధాకర్.. సాయంత్రం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంతో పాటు కృష్ణలంక స్టేషన్‌ను సందర్శించారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్న ఏసీపీ దైవప్రసాద్ బృందంతో భేటీ అయ్యారు. దర్యాప్తు వివరాలు పరిశీలించారు. విజయవాడ పోలీసుల నుంచి కేసు దస్త్రాలను సిట్ స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులో సీఐ నాగరాజును సిట్ ప్రశ్నించనుంది. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఆయన్ను విచారించనున్నారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చిన వారిలో ముగ్గురు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఒక కృష్ణలంక కానిస్టేబుల్ ఉండగా సిట్ వారిని విచారించనుంది. సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించారు, ఎక్కడ ఉంచారు, తర్వాత ఏం జరిగిందన్న కోణంలో ప్రశ్నించి వివరాలు రాబట్టే ఆస్కారముంది. అయితే, తాము సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించామని ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారికి ఇచ్చిన వాంగ్మూలంలో వీరు చెప్పినట్లు తెలిసింది. కృష్ణలంకలోని సాయికృష్ణ తల్లి ఇంటికి వెళ్లి ఆమెతో పాటు బంధువులతోనూ సిట్ మాట్లాడనుంది.
నాగరాజు తన మకాం సింగ్‌నగర్‌లోని స్నేహితుడైన హెడ్‌కానిస్టేబుల్ ఇంటికి శనివారం రాత్రి మార్చారు. ఆయనకు మద్దతుగా కృష్ణలంక నుంచి పలువురు స్థానికులు సింగ్‌నగర్‌లో ఆయన ఉన్న ఇంటి వద్దకు ఆదివారం వచ్చారు. సీఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దని డిమాండ్ చేశారు. కృష్ణలంకలో గతంలో గంజాయి, బ్లేడ్ గ్యాంగ్‌లు తిరిగేవని, ఆ అసాంఘిక శక్తులను నాగరాజు అణచివేశారని, నేరాల రేటు బాగా తగ్గించారని చెప్పారు. నాగరాజు బ్యాచ్‌కు చెందిన పలువురు ఇన్స్పెక్టర్లు వచ్చి ఆయనతో మాట్లాడారు.
కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న సిట్ అధికారులు
నేడు కోర్టుకు సీసీటీవీ హార్డ్‌డిస్క్, డీవీఆర్‌ల సమర్పణ
కృష్ణలంక స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైన హార్డ్‌డిస్క్, డీవీఆర్, ఎన్వీఆర్లను ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సీజ్ చేసింది. ఈ పరికరాలను సోమవారం కోర్టుకు సమర్పించనుంది. న్యాయస్థానం ఎండార్స్‌మెంట్‌తో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు విశ్లేషణ నిమిత్తం పంపించనున్నారు. డిజిటల్ ఆధారాలను సేకరించిన ఫోరెన్సిక్, క్లూస్ టీమ్‌తో అదివారం రాత్రి పొద్దుపోయేవరకు సిట్ సమావేశమైంది. వారు సేకరించిన సీసీటీవీ దృశ్యాల స్టోరేజి పరికరాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.