
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...
పవన్ కల్యాణ్ హావభావాలు, ఆయన మాట్లాడుతున్న విధానంపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయని ఎద్దేవా చేశారు. "ఈ శతాబ్దపు మోస్ట్ కామిక్ పర్సన్ పవన్ కల్యాణ్. ఆయన సినిమాల్లో కంటే నిజ జీవితంలోనే అత్యంత అద్భుతంగా నటిస్తున్నారు. పదిమందిలో మాట్లాడుతున్నామనే కనీస బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన మాటలకు చివరకు ఆయన పీఏ కూడా స్పందించరు. అసలు ఆయన వెంట ఒక సామాజిక వర్గం కళ్లు మూసుకుని ఎలా నడుస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత రాజకీయాలను ప్రస్తావిస్తూ... 2019 వరకు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, మరి దానిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపరని శ్రవణ్ కుమార్ నిలదీశారు. ముఖ్యంగా సంచలనం రేపిన ‘సుగాలి ప్రీతి’ కేసును పవన్ డీల్ చేస్తున్న తీరుపై ఆయన లీగల్ పాయింట్స్ లేవనెత్తారు. "సుగాలి ప్రీతి అసలు ఏ సంవత్సరంలో చనిపోయిందో కూడా కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారు. గతంలో ఈ కేసు విషయంలో ‘భౌభౌ’మని అరిచిన పవన్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు" అని మండిపడ్డారు.
సుగాలి ప్రీతి కేసులో పోలీసులు సమర్పించిన ఛార్జ్షీట్లో అన్ని రకాల పక్కా ఆధారాలు ఉన్నాయని, కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆధారాలు లేవని అనడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. "కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కోర్టులో అత్యంత భద్రంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆధారాలు లేవంటూ నిందితులను కేసు నుంచి తప్పించాలని పవన్ చూస్తున్నారా?" అంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ అజ్ఞానాన్ని చూసి జనసేన నేతలు, కార్యకర్తలు తరించాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.