నీట్-2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ముగిసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5,440 పరీక్షా కేంద్రాలలో పరీక్ష కోసం మొత్తం 22.74 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 19.95 లక్షల మంది
విద్యార్థులు హాజరైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 208 పరీక్షా కేంద్రాలలో 73,059 మంది దరఖాస్తు చేసుకోగా, 65,087 మంది అంటే 89.09 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా నిర్వహణ కోసం అధికారులు ముందెన్నడూ లేని విధంగా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అయితే.. నిర్ధారిత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమనే కఠిన నిబంధన ఎందరో విద్యార్థుల నీట్ ఆశలపై నీళ్లు జల్లింది. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్లు తప్పుగా చూపించడం, ట్రాఫిక్ జామ్‌లు, హాల్టికెట్లలోని చిరునామాల గందరగోళం కారణంగా వందలాది మంది అభ్యర్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోలేకపోయారు.ఇలాంటి కన్నీటి ఉదంతాల మధ్య హైదరాబాద్ బొల్లారంలో చోటుచేసుకున్న ఒక సంఘటన మాత్రం మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచింది. హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన హసన్ హాష్మి అనే విద్యార్థికి బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయలో నీట్ పరీక్షా కేంద్రం కేటాయించబడింది. అయితే, నగరంలోని కేంద్రీయ విద్యాలయాల లొకేషన్లపై సరైన అవగాహన లేకపోవడంతో ఆ విద్యార్థి పొరపాటున తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయకు చేరుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లాక గేటు వద్ద సిబ్బంది పరిశీలించి.. ఇది నీ సెంటర్ కాదు, నువ్వు బొల్లారం వెళ్లాలని చెప్పడంతో హసన్ హాష్మి గుండె ఆగినంత పనైంది. సమయం చూస్తే కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. కళ్లెదుటే తన ఏడాది కాలపు కష్టం, డాక్టర్ కావాలనే కల కరిగిపోతుంటే ఆ విద్యార్థి తీవ్ర ఆందోళనతో కన్నీరు మున్నీరయ్యాడు.విద్యార్థి ఆవేదనను అక్కడ విధుల్లో ఉన్న బొల్లారం ఏసీపీ రమేశ్‌కుమార్ గమనించారు. సాధారణ మార్గంలో వెళ్తే ట్రాఫిక్ వల్ల సమయానికి చేరుకోవడం అసాధ్యమని ఆయన భావించారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీపీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యున్నత భద్రతా వలయంలో ఉండే అధికారిక రాష్ట్రపతి నిలయం ప్రధాన గేట్లను ప్రత్యేక అనుమతితో అత్యవసరంగా తెరిపించారు. విద్యార్థిని పోలీసు అధికారిక వాహనంలో ఎక్కించుకుని రాష్ట్రపతి నిలయం ప్రాంగణం గుండా ఉన్న షార్ట్‌కట్ బొల్లారం కేంద్రీయ విద్యాలయ సెంటర్‌కు తీసుకెళ్లారు. వన్ మినిట్ రూల్ ముగిసే సరిగ్గా చివరి క్షణాల్లో విద్యార్థిని పరీక్షా కేంద్రం లోపలికి పంపించారు. ఏసీపీ రమేశ్‌కుమార్ చూపిన ఈ అసాధారణ సమయస్ఫూర్తి, మానవతా దృక్పథం వల్ల ఆ విద్యార్థి నీట్ పరీక్ష రాయగలిగాడు. మరోవైపు, హాల్టికెట్లలోని చిరునామాల గందరగోళం కారణంగా రంగారెడ్డి జిల్లాలో పలువురు విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది. విజయవాడ జాతీయ రహదారి వైపు ఉన్న హయత్‌నగర్‌కు, రాజేంద్రనగర్ పరిధిలోని హయత్‌నగర్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించలేక ఎందరో అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఇదే విధంగా రాజేంద్రనగర్‌లోని సాహెబ్‌నగర్ సెంటర్ అడ్రస్‌లో కూడా శివరాంపల్లి, హయత్‌నగర్, రంగారెడ్డి అని తప్పుగా ముద్రించడంతో దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొదట హయత్‌నగర్ వెళ్లి అక్కడి నుంచి తిరిగి రాజేంద్రనగర్‌కు పరుగులు తీశారు. కొందరు ఎలాగోలా సమయానికి చేరుకోగా.. మరికొందరు ఆలస్యం కావడంతో పరీక్ష రాయలేకపోయారు. కళ్ల ముందే పరీక్ష రాసే అవకాశం చేజారడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు.