తెలంగాణలో సొంత ఇల్లు లేని పేద ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సరికొత్త సాంకేతిక సొబగులను అద్దుకోనుంది. రెండో విడత ఇళ్ల నిర్మాణ లబ్ధిదారు
ల ఎంపిక, నిర్మాణ శైలిపై హౌసింగ్ కార్పొరేషన్ విప్లవాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక క్షేత్రస్థాయి సర్వేలో అధికారులు ఒక కీలక విషయాన్ని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా దాదాపు 24 వేల మంది నిరుపేదలు పూరిళ్లు, తాత్కాలిక గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజీ లేకుండా మొదటి ప్రాధాన్యతను ఈ గుడిసెవాసులకే ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇటుక, సిమెంట్, ఐరన్, ఇసుక, నిర్మాణ కార్మికుల కూలీ ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నప్పటికీ, పెరిగిన ధరల వల్ల లబ్ధిదారులు తమ సొంత డబ్బును అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పూరిళ్లలో ఉండే అత్యంత నిరుపేదలు ముందస్తుగా అంత మొత్తాన్ని భరించే పరిస్థితి ఉండదు. ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి హౌసింగ్ బోర్డు అధికారులు ' షీర్వాల్ టెక్నాలజీ 'ని తెరపైకి తెచ్చారు. ఈ సాంకేతికత ద్వారా లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా.. ప్రభుత్వమే నేరుగా అత్యాధునిక పద్ధతిలో ఇళ్లను నిర్మించి ఇవ్వనుంది.గత ఏడాది సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఒక స్టార్టప్ కంపెనీ 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షీర్వాల్ నమూనా ఇంటిని నిర్మించి ప్రదర్శించింది. అదే విధంగా.. ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి పంచాయతీ పరిధిలోని కొత్తగూడలో కూడా ఇదే పద్ధతిలో ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఇళ్ల విజయవంతమైన పనితీరును పరిశీలించిన తర్వాతే దీనిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.అసలేంటి ఈ షీర్వాల్ టెక్నాలజీ? 15 రోజుల్లో ఇల్లు ఎలా సాధ్యం?సాధారణంగా ఇళ్ల నిర్మాణానికి పిల్లర్లు, ఇటుక గోడలు వాడుతుంటారు. కానీ షీర్వాల్ పద్ధతిలో ఇటుకల వాడకం ఉండదు. పునాది నుంచి పైకప్పు వరకు అంతా మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మాణమే జరుగుతుంది. జిన్నారంలో నిర్మించిన నమూనా ప్రకారం.. 22.3 అడుగుల పొడవు, 18 అడుగుల వెడల్పుతో మొత్తం 400 చదరపు అడుగుల స్లాబ్ వచ్చేలా ప్లాన్ చేశారు. దీని కోసం 8ఎంఎం, 10ఎంఎం స్టీల్‌తో పాటు, అల్యూమినియం ప్యానెల్స్ ఉపయోగించి రెడీమిక్స్డ్ సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్‌ను గోడల అచ్చుల్లో పోస్తారు.ఈ పద్ధతిలో కేవలం 5 రోజుల్లో పునాది, మరో 6 రోజుల్లో గోడలతో కూడిన శ్లాబ్, ఆ తర్వాత మిగిలిన 4 రోజుల్లో ఫినిషింగ్, పెయింటింగ్, ప్లంబింగ్ పనులను పూర్తి చేస్తారు. అంటే కేవలం 15 రోజుల్లోనే పూర్తి స్థాయి పక్కా ఇల్లు నివాసానికి సిద్ధమవుతుంది. అత్యంత వేగంగా పూర్తయ్యే ఈ ఇంటి నిర్మాణ వ్యయం కేవలం రూ. 5 లక్షల్లోనే ముగుస్తుంది.సాధారణ ఇటుక ఇళ్లతో పోలిస్తే షీర్వాల్ సాంకేతికతతో కట్టే ఇళ్లు అత్యంత బలమైనవిగా, భూకంపాలను సైతం తట్టుకునే విధంగా ఉంటాయి. ఇటుకల మధ్య జాయింట్లు ఉండవు కాబట్టి గోడలు బీటలు వారడం, తేమ పట్టడం వంటి సమస్యలు ఉండవు. నిపుణుల అంచనా ప్రకారం ఈ ఇళ్ల లైఫ్ టైమ్ కనీసం 70 నుంచి 80 సంవత్సరాల పైనే ఉంటుంది. తక్కువ ఖర్చుతో, అత్యధిక నాణ్యతతో, అతి తక్కువ కాలంలో పూర్తయ్యే ఈ టెక్నాలజీ తెలంగాణ గృహ నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది.