
ఈ చిత్రంలో కనిపిస్తున్న తండ్రీకూతుళ్లు సుంకోజు వెంకటాచారి, శివాని. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బంగారుగడ్డ కాలనీలో వీరి నివాసం.
27 ఏళ్ల శివాని పుట్టుకతోనే ‘ఆర్థోపెడిక్ లోకోమేటివ్’ అనే జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. ఆ కారణంగా ఎదుగుదల లోపించడంతోపాటు ఎముకలు పెళుసుగా ఉండేవి. చిన్నతనంలో ఎవరైనా ముద్దుచేసి ఎత్తుకున్నా, శరీరాన్ని గట్టిగా కదిలించినా ఎముకలు విరుగుతుండేవి. అలా అనేకసార్లు ఎముకలు విరగడం.. ఆసుపత్రిలో కట్టు కట్టించడం ఆనవాయితీగా మారింది. వాటికి తోడు 15 ఏళ్ల వయసు వచ్చేసరికి కాళ్లు, చేతులు వంకర్లు తిరిగాయి. బైక్ మెకానిక్‌గా పనిచేసే వెంకటాచారి బిడ్డను చూపించని ఆసుపత్రి అంటూ లేదు. ఈ క్రమంలో రూ.లక్షలు ఖర్చు చేశారు. అలాగని బిడ్డను ఇంటికే పరిమితమూ చేయలేదు. కుమార్తెకు చదువంటే ఇష్టమని తెలుసుకుని... ఎనిమిదో ఏట నుంచి శివానిని బడికి పంపించారు. ఒకటో తరగతి నుంచి పీజీ(ఎంకామ్) పూర్తయ్యే వరకు రోజూ తానే చంకన ఎత్తుకుని తీసుకెళ్లడం..తీసుకురావడం చేసేవారు. 90% మార్కులతో పీజీ పూర్తిచేసిన శివాని ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..‘నా కూతురు ఉద్యోగం చేస్తే చూడాలనేది నా కోరిక’ అని వెంకటాచారి చెబుతున్నారు. ‘పుట్టినప్పుడే శివాని తుంటి ఎముక విరిగింది. అలా అనేకసార్లు ఎముకలు విరుగుతుండటంతో ఎందరో వైద్యులను సంప్రదించాం. చివరికి అది జన్యు వ్యాధి కారణంగా జరుగుతోందని, దానికి చికిత్స లేదని తెలుసుకున్నా. ‘ఓ గాజు బొమ్మ’ పుట్టిందని అర్థం చేసుకున్నా. అప్పట్నుంచి ఎంతో సున్నితంగా కాపాడుకుంటూ వస్తున్నా’ అని వెంకటాచారి చెబుతున్నారు. తన బిడ్డ వైకల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.