మూలికల వైద్యం పేరుతో ఓ 75 సంవత్సరాల వృద్ధుడిని మోసం చేసి అతని నుంచి విడతల వారీగా రూ. 56 లక్షలు కాజేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
తొలుత మూలకల వైద్యం చేస్తామని చెప్పి కొరియర్ ద్వారా మందులు పంపించిన నిందితులు, ఆ తర్వాత లేహ్యాలు తాగించి చివరికి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. రూ. 56 లక్షలు ఇచ్చినప్పటికీ ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో చేసేదేమీలేక నిందితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం 75 సంవత్సరాల వ్యాపారవేత్త అనారోగ్య సమస్యలతో థానేలోని ఓ నాటువైద్యుడి దగ్గరికి వెళ్లాడు. అతని సమస్య తెలుసుకున్న నాటు వైద్యుడు చికిత్స చేస్తామని నమ్మించి గతేడాది నవంబర్ నుంచి బాధితుడికి కొరియర్ ద్వారా మందులు పంపిస్తూ వచ్చారు. నాటు వైద్యుడు పంపిన మందులు వాడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం లేదని వ్యాపారవేత్త చెప్పాడు. ఓ రోజు నాటు వైద్యుడు, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి ఈ వ్యాపార వేత్తని ఘోడ్‌బందర్ రోడ్డులోని గైముఖ్ చౌపట్టి ప్రాంతానికి పిలిపించారు. అక్కడ వివిధ రకాల మూలికలతో ఓ మిశ్రమాన్ని తయారు చేసి ఆ మందును బలవంతంగా తాగించారు. దాంతో సమస్య ఇంకాస్త ఎక్కువయింది. దీనికి చికిత్స చేయాలంటే రూ. 56 లక్షల ఖర్చు అవుతుందని చెప్పి వృద్ధ వ్యాపారవేత్తని డబ్బులు డిమాండ్ చేశారు.తాము చెప్పినంత డబ్బులు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వృద్ధుడిని నాటువైద్యుడు బెదిరించాడు. ఇంటికి వ్యక్తులను పంపించి డబ్బులు వసూలు చేస్తామని, అదేవిధంగా అనారోగ్య సమయంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. పరువు భంగం వాటిల్లే ప్రమాదం ఉండటంతో ఆ వృద్ధుడు మొదట రూ. 20 వేలు ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి విడతల వారీగా రూ. 56.2 లక్షలు నిందితుల ఖాతాలకు బదిలీ చేశాడు. అంత డబ్బు తీసుకున్నప్పటికీ ఇంకా ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక బాధితులు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.