
Save The Tigers 3 Review || వెబ్‌సిరీస్: సేవ్ ది టైగర్స్ 3; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్,...
Save The Tigers 3 Review || వెబ్‌సిరీస్: సేవ్ ది టైగర్స్ 3; నటీనటులు: ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్, రోహిణి, గంగవ్వం, ఝాన్సీ తదితరులు; క్రియేటర్స్: మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతమ్; నిర్మాత: శివ మేక, సాహితి చింతలపూడి; దర్శకత్వం: శ్రీరామ్; స్ట్రీమింగ్ వేదిక: జియో హాట్‌స్టార్
కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా రూపొందించిన వెబ్‌సిరీస్‌ల్లో ‘సేవ్ ది టైగర్స్’ (Save The Tigers ) ఒకటి. ఇప్పటివరకూ రెండు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ ముచ్చటగా మూడోసారి అలరించడానికి వచ్చింది. నిత్య జీవితంలో భార్య-భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలనే సరదాగా తెరపై ఆవిష్కరించిన మొదటి రెండు సీజన్లు అలరించగా, మూడో సీజన్లో దేవుడితో ముడిపెట్టారు. మరి ఈ సీజన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
గంటా రవి (ప్రియదర్శి), విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభివన్ గోమఠం) కెరీర్లో ఇబ్బందులు పడుతుంటారు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న గంటా రవి ఎన్నికల్లో ఓడిపోతాడు. మరోవైపు భార్య హైమా (జోర్దార్ సుజాత) పోరు పడలేక బస్తీ నుంచి గేటేడ్ కమ్యూనిటీకి మారిపోతాడు. అయినా, మనశ్శాంతి ఉండదు. విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) అపార్థం చేసుకోవడంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. సినీ రచయిత కావాలనుకున్న రాహుల్ తన భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మాట కాదనలేక ఉద్యోగంలో చేరతాడు. అయితే, తన నోటి తొందర వల్ల ఆ ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. దీంతో తమ కష్టాలను చెప్పుకోవడానికి ముగ్గురు బార్‌కు చేరుకుంటారు. తాగిన మైకంలో గంటా రవి, విక్రమ్, రాహుల్ మరో ముగ్గురిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ అయిన వాళ్లు కూడా అచ్చం ఈ ముగ్గురిలానే ఉంటారు. ఒకేలా ఉన్న వ్యక్తుల్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? వాళ్లుకు వీళ్లకూ ఉన్న సంబంధం ఏంటి? దీని వెనుక దేవలోకపు రాజు ఇంద్రుడు (వెన్నెలకిషోర్) స్క్రిప్ట్ ఏంటి? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చెబుతారు. ఈ కాన్సెప్ట్‌తో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. మానవులు తిట్టారనో లేదా తమ భక్తుడికి సాయం చేద్దామనో దేవతలు భూలోకానికి రావడం ఆ తర్వాత జరిగే పరిణామాలతో వినోద్మాతంగా అలరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ‘సేవ్ ది టైగర్స్ 3’కు కూడా ఇదే కాన్సెప్ట్‌ను జోడించి, వినోదం మేళవించి క్రియేటర్స్.. మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతమ్.. దర్శకుడు శ్రీరామ్ ఎరగం ప్రేక్షకులకు అందించారు. ఒకే రూపంతో ఉన్న ముగ్గురు వ్యక్తులు తమ ప్రపంచాలను మార్చుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?వారి కుటుంబంలో ఎలాంటి అలజడి రేగింది? చివరికి ఎవరి ప్రపంచాలకు వాళ్లు వెళ్లారా? లేదా?ఇలాంటి అంశాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ‘సేవ్ ది టైగర్స్3’ బృందం చాలా వరకూ విజయం సాధించింది.
మొదటి రెండు ఎపిసోడ్లలో రెండు వేర్వేరు ప్రపంచాలకు సంబంధించిన గంటా రవి, విక్రమ్, రాహుల్ పాత్రల స్వభావం, వారి జీవన శైలి, కుటుంబంతో వారికున్న అనుబంధం పరిచయం చేస్తూ తీర్చిదిద్దారు. మూడో ఎపిసోడ్ నుంచి ఒకే పోలికతో ఉన్న వారిని వేరే ప్రపంచాల్లోకి పంపడంతో అసలు వినోదం మొదలవుతుంది. ఈ విషయంలో గుప్త (గుండు సుదర్శన్) పెట్టే కండీషన్లు కూడా లాజికల్‌గానే అనిపిస్తాయి. మనుషుల స్వాపింగ్ జరిగిన తర్వాత రెండు ప్రపంచాల మధ్య వైవిధ్యం, అక్కడి పరిస్థితుల నుంచి వినోదం పుట్టించే ప్రయత్నం చేశారు. అవన్నీ చాలా వరకూ వర్కవుట్ అయ్యాయి. మొదటి ప్రపంచంలో భార్యలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉంటే, రెండో ప్రపంచంలో వాటిని పూర్తి భిన్నంగా చూపిస్తూ సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పాజిటివ్, నెగెటివ్ కోణాలను తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. భార్య, భర్త ఒకరికి ఒకరు విలువ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఇస్తే ఎలా ఉంటుంది?ఇలా రెండు ప్రపంచాలను మిళితం చేసి చూపించడం చూస్తే, నిత్య జీవితంలో మనం చూసే సంఘటనలే తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. రెండు ప్రపంచాల స్వాపింగ్ తర్వాత వినోదం బాగున్నా, క్రమక్రమంగా ఆ రుచి తగ్గిపోతూ వస్తుంది. చివరి ఎపిసోడ్లో రెండు ప్రపంచాల వ్యక్తుల మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ ఆట, పని మనిషి లక్ష్మీ (రోహిణి) యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి.
తొలి రెండు సీజన్లలో తమదైన నటనతో మెప్పించిన ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ.. ఈ సారి మరింత క్లిష్టమైన పాత్రల్లో అలరించారు. ఒకేసారి రెండు రకాల పాత్రలు, ఆహార్యం, సంభాషణ పలికించడంతో తమ ప్రతిభ చూపారు. డ్యుయల్ రోల్స్‌లో జీవించారు. భార్యలుగా నటించిన జోర్దార్ సుజాత, దేవయాని, పావణి గంగిరెడ్డి నటన ఓకే. ఇక పని మనిషిగా లక్ష్మీ పాత్రలో రోహిణి నటన, కామెడీ టైమింగ్ బాగుంది. అయితే, గత సీజన్లతో పోలిస్తే, ఆ డోస్ తగ్గింది. ముక్కు అవినాష్, గంగవ్వ, మిర్చి కిరణ్, అభయ్, గుండు సుదర్శన్ తమ పరిధిమేరకు నటించారు. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్ రోల్ బాగుంది. ట్రెండ్‌కు తగ్గట్టు డైలాగ్స్, పంచ్‌లతో నవ్వించే ప్రయత్నం చేశారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. లోకాల స్వాపింగ్ కాన్సెప్ట్‌తో ‘సేవ్ ది టైగర్స్ 3’ డిజైన్ చేసిన విధానం, కామెడీ ఫర్వాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.