
పాకిస్థాన్ మరోసారి భారత్ పై నోరు పారేసుకుంది. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతూ.. భారత్ లోని ముస్లిం మతపరమైన స్థలాలకు ముప్పు పొంచి ఉందని కీలక ఆరోపణలు సంధించారు.
ఇటీవల యూనైటెడ్ నేషన్స్ మీటింగ్ లోనూ ఇలాగే భారత్ పై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా మరోసారి భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్.
అయితే భారత అంతర్గత విషయాలపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాకిస్థాన్ కు లేదని స్పష్టం చేసింది. భారత్ పై పాకిస్థాన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు తమ దేశాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు భారత్ లోని ముస్లిం మతపరమైన స్థలాలకు, చారిత్రక కట్టడాలకు ముప్పు పొంచి ఉందంటూ జర్దారీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. పాకిస్థాన్ లోని మైనారిటీల పరిస్థితి ఏంటి..? అని రణధీర్ ప్రశ్నించారు. వాళ్లను కావాలనే అణచివేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. పాకిస్థాన్ లోని హిందువులు, సిక్కులు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారిని అణచివేస్తోందని.. అలాంటి పాకిస్థాన్ తమకు నీతులు చెప్పడం ఏంటని మండిపడ్డారు. పాకిస్థాన్ లోని రాజకీయ పార్టీలు తమ దేశంపై విషం చిమ్ముతున్నాయని అందువల్ల కావాలనే పాకిస్థాన్ అధ్యక్షుడితో ఇలాంటి వ్యాఖ్యలు చెప్పిస్తున్నాయని దుయ్యబట్టారు.
ఇక అంతకుముందు పాకిస్థాన్ అధ్యక్షుడు తన ఎక్స్ మాధ్యమం వేదికగా కీలక పోస్టు పెట్టారు. " వారణాసిలో 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతనమైన మసీద్ గంజ్ షాహీదా కూల్చివేతకు ముప్పు పొంచి ఉంది. అలాగే భారత్ లోని మరికొన్ని ముస్లిం చారిత్రక ప్రదేశాలదీ అదే పరిస్థితి. భారత్ తక్షణమే ఇలాంటి చర్యలు మానుకోవాలి. మైనారిటీల హక్కులను కాపాడాలి. హెరిటేజ్ సంస్థలను రక్షించాలి" అని అన్నారు. అయితే పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలకు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కావాలనే భారత్ ను అంతర్జాతీయంగా కించపరిచేలా పలు సందర్భాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. పాకిస్థాన్ కు భారత్ చాలాసార్లు బుద్ధి చెప్పినా ఆ దేశం మాత్రం తన ప్రవర్తనను మార్చుకోవట్లేదు.