
భారత క్రికెట్ దిగ్గజ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో మరోసారి రెచ్చిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వీరవిహారం చేశాడు.
అదిరిపోయే రేంజ్లో హాఫ్ సెంచరీ బాదాడు. వన్డే కెరీర్లో తన 62వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న రోహిత్.. కేవలం 69 బంతుల్లోనే 79 పరుగులు చేసి దుమ్మురేపాడు. 114.49 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు దంచికొట్టాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్లో ఏకంగా 37 ఏళ్ల నాటి ఒక భారీ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
భారత్ తరఫున వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన అత్యంత వృద్ధ క్రికెటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ విషయంలో మాజీ భారత క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉన్న పాత రికార్డును రోహిత్ చెరిపేశాడు.
15 అక్టోబర్ 1989లో షార్జాలో పాకిస్తాన్‌పై అమర్నాథ్ 80 బంతుల్లో 88 రన్స్ చేసినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాల 21 రోజులు. కాగా, 20 జూన్ 2026 న ఆఫ్ఘనిస్తాన్పై 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాల 51 రోజులు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రోహిత్ నిలిచాడు.
భారత్ తరఫున వన్డేల్లో అత్యంత ఎక్కువ వయసులో యాభై ప్లస్ స్కోరు చేసిన టాప్ 5 ప్లేయర్స్ లిస్ట్ గమనిస్తే..
1. రోహిత్ శర్మ: (39 సంవత్సరాల, 51 రోజులు) - 79 పరుగులు
2. మొహిందర్ అమర్నాథ్: (39 సంవత్సరాల, 21 రోజులు) - 88 పరుగులు
3. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 329 రోజులు) - 52 పరుగులు
4. సచిన్ టెండూల్కర్: (38 సంవత్సరాల, 327 రోజులు) - 114 పరుగులు
5. రాహుల్ ద్రవిడ్: (38 సంవత్సరాల, 248 రోజులు) - 69 పరుగులు
ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యంత ఎక్కువ వయసులో యాభై ప్లస్ స్కోరు చేసిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బ్యాట్స్‌మెన్ ఖుర్రమ్ ఖాన్ పేరిట ఉంది. 2 డిసెంబర్ 2014న దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 80 బంతుల్లో నాటౌట్‌గా 85 రన్స్ చేసినప్పుడు ఖుర్రమ్ ఖాన్ వయసు 43 సంవత్సరాల 164 రోజులు. వన్డేల్లో సెంచరీ కొట్టిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఆటగాడు కూడా ఇతనే.
30 నవంబర్ 2014న దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 132 రన్స్ చేసినప్పుడు అతని వయసు 43 సంవత్సరాల 162 రోజులు. ఇక టెస్ట్ ఆడే దేశాల పరంగా చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహ్మద్ నబీ అత్యంత వృద్ధ క్రికెటర్‌గా ఉన్నాడు. 14 అక్టోబర్ 2025న అబుదాబిలో బంగ్లాదేశ్‌పై 37 బంతుల్లో 62 రన్స్ చేసినప్పుడు నబీ వయసు 40 సంవత్సరాల 286 రోజులు.
రోహిత్ శర్మ వన్డే కెరీర్లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది 95వ సారి. ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్.. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కి నెట్టాడు. ద్రవిడ్ వన్డేల్లో 94 సార్లు యాభై ప్లస్ స్కోర్లు (12 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు) చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 33 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలతో 95 సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో రోహిత్ కంటే ఎక్కువ సార్లు 50+ స్కోర్లు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (145 సార్లు), విరాట్ కోహ్లీ (131 సార్లు) మాత్రమే ముందున్నారు.