
నరహరిరావు భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను పగలగొట్టిన ఏసీబీ ఈనాడు, హైదరాబాద్- న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన ‘సర్వే బందోబస్తు, భూమి రికార్డుల’...
నరహరిరావు భార్య పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను పగలగొట్టిన ఏసీబీ
ఈనాడు, హైదరాబాద్- న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయిన ‘సర్వే బందోబస్తు, భూమి రికార్డుల’ కార్యాలయం మల్టీజోన్-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావు సంచలనాల పరంపర కొనసాగుతోంది. ఏసీబీ సోదాల చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో ఆయన ఇంట్లో ఏకంగా సుమారు రూ.1.54 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్ల నిల్వ, మరో రూ.5.04 కోట్ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లతో దొరికిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం శాలిబండ కెనరా బ్యాంకులో నరహరిరావు భార్య వందన పేరిట ఉన్న లాకర్లను తెరవగా మరో రూ.1.5 కోట్ల నగదుతోపాటు సుమారు 2 కిలోల మేర బంగారం బిస్కెట్లు, ఆభరణాలు లభ్యం కావడం మరో సంచలనంగా మారింది.
ఈ నెల 16న ఏసీబీ బృందాలు నరహరిరావు ఇంట్లో జరిపిన సోదాల్లో ఈ బ్యాంకు లాకర్ల వివరాలను గుర్తించారు. వాటి తాళాలు ఇచ్చేందుకు నరహరిరావు నిరాకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం అనుమతితో సెర్చ్ వారెంట్ పొందిన ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ఖాన్, ఇన్స్పెక్టర్ గౌస్ ఆజాద్ బృందం బ్యాంకు లాకర్లను పగలకొట్టగా నోట్ల కట్టలు, బంగారం నిల్వలు బయటపడ్డాయి. మరోవైపు 16న జరిపిన సోదాల్లో లభించిన చర, స్థిరాస్తుల విలువ రూ.13.05 కోట్లు(రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం)గా లెక్కగట్టారు.
హైదరాబాద్‌లోని ఛత్రినాక గౌలిపురాకు చెందిన సుంకరి నరహరిరావు పూర్వీకులది సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయనకు వారసత్వంగా ఒక పాత ఇల్లు మాత్రమే వచ్చింది. తండ్రి సర్వేయర్‌గా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద నరహరిరావు 1987లో మండల సర్వేయర్‌గా నియమితులయ్యారు. భార్య గృహిణి కాగా కుమారుడు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. 2022లో కుమార్తె వివాహం చేశారు. నరహరిరావు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువకాలం సర్వేయర్‌గా, సర్వే సెటిల్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సమయంలోనే హైదరాబాద్ పరిసరాల్లో స్థిరాస్తి బూమ్ రావడంతో భూములకు సర్వే నెపంతో అడ్డగోలుగా సంపాదించడం మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులవిగా సర్వే నివేదికలు సృష్టించి వారి నుంచి డబ్బులు దండుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. తర్వాత మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యాక మరింత అడ్డగోలుగా సంపాదించి కుటుంబసభ్యుల పేరిట ఆస్తుల్ని కూడగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎవరిపైనా నమ్మకం లేకనే అక్రమ సంపాదనంతా ఇంట్లో, బ్యాంకుల్లో దాచినట్లు వెల్లడైంది.
దాదాపు 39 ఏళ్లపాటు ఉద్యోగంలో పనిచేసిన నరహరిరావు ఏసీబీకి దొరికే నాటికి ఆయనతోపాటు కుటుంబసభ్యుల అధీనంలోని ఆస్తుల విలువ రూ.3.67 కోట్లు(రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మాత్రమే) ఉంటుందని లెక్కగట్టారు. అలాగే ఆయన ఉద్యోగంతోపాటు ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1.60 కోట్లు మాత్రమే. మరోవైపు తన సంపాదనలో ఏకంగా రూ.1.01 కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఈ లెక్కన సుమారు రూ.59 లక్షలు మాత్రమే మిగిలి ఉండాలి. కానీ, అదనంగా దాదాపు రూ.3.08 కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్లు తేలింది. నరహరిరావు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.