
స్కూటరుపై ఉన్న దొంగలను అడ్డుకొంటున్న కార్మికుడు ఈటీవీ భారత్: కర్ణాటకలో మొబైల్ చోరీ యత్నం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బెంగళూరులోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో స్కూటరుపై వచ్చిన జునైద్ (18), అర్బాజ్ (23) ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోను లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించారు. బాధితుడు అరుస్తూ వారి వెంటపడ్డాడు. స్కూటరుకు ఎదురుగా వచ్చిన ఓ కార్మికుడు తన చేతిలోని బస్తాను నిందితులపైకి విసిరాడు. వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. చుట్టుపక్కల జనం తమ వైపు వస్తున్నట్లు గమనించిన నిందితులు వాహనం, ఫోను అక్కడే వదిలేసి పరుగు తీశారు. 250 మీటర్ల దూరం పరుగెత్తగానే జునైద్ రోడ్డుపైనే కుప్పకూలి మృతిచెందాడు. మరో నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జునైద్‌కు గుండెజబ్బు ఉందని, స్టంటు కూడా అమర్చినట్లు అతడి తల్లిదండ్రులు పోలీసుల విచారణలో తెలిపారు. జునైద్‌కు ఇదే తొలి నేరం కాగా, అర్బాజ్ గతంలోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.