
కన్నతండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడాడు. ‘ఆడపిల్ల భారమని’ ఎందరు ఎన్ని మాటలు అన్నా... ‘ఈ బిడ్డ నాకు దేవుడిచ్చిన వరం’ అంటూ అందరికీ సమాధానం చెప్పాడు. ఆమెని పెంచి పెద్ద చేయడమే కాదు..
కన్నతండ్రి కాకపోయినా కంటికి రెప్పలా కాపాడాడు. ‘ఆడపిల్ల భారమని’ ఎందరు ఎన్ని మాటలు అన్నా... ‘ఈ బిడ్డ నాకు దేవుడిచ్చిన వరం’ అంటూ అందరికీ సమాధానం చెప్పాడు. ఆమెని పెంచి పెద్ద చేయడమే కాదు... నలుగురూ గౌరవించే స్థాయిలో నిలబడేందుకు సహకరించిన ఓ తండ్రి కథ ఇది.
మూడు దశాబ్దాల క్రితం... అసోంలోని తిన్సుకియా గ్రామం. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేవాడు సొరబెన్. ఎప్పటిలానే ఆరోజు కూడా వీధుల్లో తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. అంతలోనే చెట్టు వెనక చెత్త కుండీ దగ్గర పసికందు ఏడుపు వినిపించింది. అందరిలా ‘నాకు ఎందుకులే’ అని అతనూ వెళ్లిపోయి ఉంటే ఆ బిడ్డ పరిస్థితి ఏమై ఉండేదో! ఏదైతే అది అయ్యిందని వెళ్లి చూశాడు. చీమలు కుట్టి కందిపోయి, రక్తమోడుతున్న చిన్నారిని చూసి చలించిపోయాడు. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని నీళ్లతో శుభ్రం చేసి, చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. ఎవరూ కనిపించలేదు. చేసేదేమీ లేక తన ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పటికి ఆయనకు 29ఏళ్లే. ‘ఆడపిల్ల, మనం బతకడమే కష్టంగా ఉంది. ఈ భారం అవసరమా’ అని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినలేదు. ఆ బిడ్డను పెంచాలనే నిశ్చయించుకున్నాడు సొరబెన్. పాపకు జ్యోతి అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ‘నాన్న లేకపోతే నేను అసలు ఉండేదాన్నో లేదో కూడా తెలియదు. నాకోసం పెళ్లి కూడా చేసుకోలేదు. పగలూ రాత్రీ తేడా లేకుండా కష్టపడి నన్ను పెంచారు. ‘నువ్వు బాగా చదువుకోవాలి. అప్పుడే నిన్ను అందరూ గౌరవిస్తారు’ అని చెప్పేవారు. ఆయన శ్రమ, నా పట్టుదలకు ఫలితమే అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉద్యోగం’ అంటూ ఫలితాలు విడుదల అయ్యాక తన కథను చెప్పుకొచ్చారు జ్యోతి. ఇది జరిగి పన్నేండేళ్లు గడుస్తున్నా... సామాజిక మాధ్యమాల్లో మరోసారి వైరల్గా మారిందీ తండ్రీ కూతుళ్ల కథ.
నాన్నకు కూతురుగా ఉండటం అంటే... జీవితాంతం రక్షణ కవచం పొందినట్లే. దీన్ని నిజం చేస్తూ... ‘నాన్నా... పులి’ కథ విన్న ఓ చిన్నారి ‘వాళ్ల నాన్న రాలేదేమో గానీ మా నాన్న నేను ఎన్నిసార్లు పిలిచినా వస్తాడు’ అని చెప్పిందట. తండ్రి ప్రేమకు ఇంతకన్నా గొప్ప కొలమానం ఏముంటుంది?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.