అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. ముందు నుంచి వ్యక్తమవుతోన్న అనుమానాలే నిజమయ్యేలా ఉన్నాయి.
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచిన 24 గంటల్లోనే మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ తీరును టెహ్రాన్ తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోనే హర్మూజ్ మూసివేత నిర్ణయంపై తీసుకున్నట్లు ఇరాన్ ఉన్నతస్థాయి సంయుక్త సైనిక కమాండ్ ఖతమ్ అల్ అన్బియా కేంద్ర కార్యాలయం వెల్లడించింది. అంతేకాదు, తమ ప్రతిస్పందనలో ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, వాటి తీరు ఇలాగే కొనసాగితే మరిన్ని చర్యలు తప్పవని హెచ్చరించింది.ఈ చర్య అమెరికా-ఇరాన్ ఒప్పందానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ ఒప్పందం ప్రకారం అమెరికాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU) కింద 60 రోజుల చర్చల కాలంలో జలసంధిని ద్వారా రవాణా సాగించే నౌకలపై టోల్ ఫీజు మాఫీ చేయడానికి టెహ్రాన్ అంగీకరించింది. హర్ముజ్ జలసంధిని సమీపించవద్దని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళం నౌకలను హెచ్చరించింది. అలా చేస్తే వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొంది.అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలో లెబనాన్‌పై దాడులు ఆపేయాలనేది ఒక నిబంధన. కానీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతనాహ్యు మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మూసివేతకు ముందు, మధ్యంతర ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు జలసంధి గుండా ప్రయాణించాలనుకునే నౌకలు.. గమ్యస్థానానికి చేరడానికి కనీసం 48 గంటల ముందు ట్రాన్సిట్ రిక్వెస్ట్ సమర్పించాల్సి ఉండేది. ఇదిలా ఉండగా, కాల్పుల విరమణ కొనసాగుతుందని తాము విశ్వాసంతో ఉన్నానని, ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తోందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.ఇరాన్‌తో విస్తృత ఒప్పందంపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుం. దక్షిణ లెబనాన్‌లో భీకర దాడులు కారణంగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు రద్దు కావడంతో ఇజ్రాయెల్, హజ్బొల్లా ఒకరిపై ఒకరు దాడులు నిలిపివేయడానికి శుక్రవారం అంగీకరించాయి. ఇజ్రాయెల్, లెబనాన్ పోరు యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించిన ప్రాథమిక ఒప్పందంపై సందేహాలను మరింత పెంచింది.శుక్రవారం రాత్రి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు సైన్యం 150 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడిచేసి, డజన్ల కొద్దీ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి భిన్నమైన ఆదేశాలు అందలేదని సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు. ఇజ్రాయెల్ దళాలు ఆత్మరక్షణ కోసం పనిచేస్తున్నాయని, అలాగే కొనసాగుతాయని ఆయన చెప్పారు.