ఏపీ రైతులకు శుభవార్త. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.7 వేల చొప్పున రూ.3,125 కోట్లను జమ చేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన నిధులను విడుదల చేయగా.. లింగంగుంట్లలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేశారు. అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో రైతులు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తమ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా లేదా.. ఒకవేళ పడితే ఏ బ్యాంకులో పడ్డాయనే వివరాలను స్టేటస్ చెక్ చేయటం ద్వారా తెలుసుకునే వీలుంది. ఇందుకోసం మొదట వెబ్సైట్ సందర్శించారు. వెబ్సైట్ ఓపెన్ కాగానే హోమ్ స్ర్కీన్ మీద ఉన్న Know Your Status అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ ఆధార్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి.. కాప్చా నమోదు చేసిన తర్వాత సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి.క్లిక్ చేయగానే రైతుల వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. పథకానికి అర్హులై ఉంటే రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం, పథకం స్టేటస్‌కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అలాగే ప్రభుత్వం జమ చేసిన డబ్బులు ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయనే సంగతి తెలుసుకోవచ్చు. మరోవైపు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14000. ఇందులో తొలివిడత కింద రూ.7000 , రెండో విడత కింద రూ.7000.. మూడో విడత కింద రూ.6000లను రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత నిధులను చంద్రబాబు శనివారం విడుదల చేశారు.