ప్రియుడితో గడపడానికి అడ్డుగా ఉన్నాడని కన్నబిడ్డ ప్రాణాలు తీసింది ఓ మహిళ. ఏడుస్తూ తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడని, చంపేద్దామని ప్రియుడు చెప్పిన మాటలు విని నేలకేసి కొట్టి అత్యంత కిరాతకంగా...
ప్రియుడితో గడపడానికి అడ్డుగా ఉన్నాడని కన్నబిడ్డ ప్రాణాలు తీసింది ఓ మహిళ. ఏడుస్తూ తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడని, చంపేద్దామని ప్రియుడు చెప్పిన మాటలు విని నేలకేసి కొట్టి అత్యంత కిరాతకంగా వ్యవహరించింది. కొడుకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని తర్వాత భర్తకు కట్టుకథ చెప్పి నమ్మించింది. కానీ, ఆమె ప్రవర్తన తేడాగా ఉండటం గమనించి భర్త పెద్దల ముందు పంచాయతీ పెట్టించడంతో గుట్టురట్టయ్యింది. తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చిన ఈ దారుణమైన ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో గత నెలలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్కు చెందిన జ్యోతి, స్వామి దంపతులు. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన ఈ కుటుంబం.. మేడ్చల్ జిల్లా కీసరలో ఉంటోంది. క్యాబ్ డ్రైవర్గా స్వామి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. భార్య జ్యోతి ఇంటి దగ్గర పిల్లలను చూసుకుంటోంది.అయితే, పెళ్లికి ముందు నుంచి యాదాద్రి జిల్లా మాదాపూర్కి చెందిన నవీన్ అనే యువకుడితో జ్యోతికి వివాహేతర సంబంధం ఉంది. వివాహం తరవాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మే 29న స్వామి విధులకు వెళ్లిపోగా.. ప్రియుడు నవీన్ వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో జ్యోతి రెండేళ్ల కొడుకు ఏడవడంతో తమ సరదాకు భంగం కలిగించాడని ప్రియుడికి కోపం వచ్చింది. పిల్లాడి ఏడుపు బయటకు వినిపిస్తే సమస్య అవుతుందని, వాడ్ని చంపేద్దామని జ్యోతికి చెప్పాడు. ప్రియుడు మోజులో కామంతో కళ్లు మూసుకుపోయిన జ్యోతి.. రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా వ్యవహరించింది.దీంతో ఆ బాలుడి అక్కడక్కడే చనిపోయాడు. జ్యోతి భర్త ఇంటికి వచ్చేసరికి కట్టుకథ అల్లింది. బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడని స్వామిని, బంధువులను నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకపోవడంతో అంత్యక్రియలు జరిగిపోయాయి. కానీ, ఆ తరవాత ఆమె ప్రవర్తన తేడాగా ఉండటంతో స్వామిని అనుమానం వచ్చింది. భార్యను నిలదీస్తే ఏం లేదని బుకాయించింది. చివరకు కుటుంబసభ్యుల ముందు పంచాయితీ పెట్టించి, నిలదీయడంతో తానే కొడుకును చంపినట్టు అంగీకరించింది. చివరకు ఆమె వివాహేతర సంబంధం గుట్టుకూడా రట్టయ్యింది. పోలీసులకు భర్త ఫిర్యాదు చేయడంతో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం పంపారు. నిందితురాలు జ్యోతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు నవీన్ కోసం గాలిస్తున్నారు.