
నార్త్ లండన్ లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 80 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
రైల్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. రెండు రైళ్లు లండన్ లోని సెయింట్ పాన్‌క్రాస్ స్టేషన్ కు వెళ్తుండగా బెడ్ ఫోర్డ్ నగరం వద్ద స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఘటనాస్థలి వద్దకు ఆంబులెన్స్ లు, ఫైర్ ఫైటర్స్, పోలీస్ యూనిట్స్, ఒక ఎయిర్ అంబులెన్స్ ను అలాగే హజార్డియస్ ఏరియా రెస్పాన్స్ టీమ్ ను మోహరించారు. క్షతగాత్రులను వేగంగా సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని.. దురదృష్టవశాత్తూ ఓ వ్యక్తి మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఇక పీటర్ నాప్ అనే ప్రయాణికుడు ఈ ఘటనపై స్పందిస్తూ.. రెండు రైళ్లు ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండా ఢీ కొన్నాయని తెలిపాడు. చెయిన్ లాగే లోపే జరగాల్సిన దారుణం జరిగిపోయిందని.. అప్పటికే రెండు రైళ్లు ఢీ కొని పొగలు రావడం తాను చూశానని అన్నాడు. ప్రయాణికులు ఒక్క సారిగా ఏమైందో తెలియక ఏడుస్తూ, కేకలు పెడుతూ ఉన్నారని ఆ దృశ్యాలు భయాన్ని కలిగించాయని తెలిపాడు. అదే సమయంలో తాను కిటికీ నుంచి బయటపడి తప్పించుకున్నానని పేర్కొన్నాడు. నేను కిందకు దిగి చూసే సరికి చాలామంది ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరిగి రోదిస్తున్నారని వివరించాడు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రైల్వే వర్కర్స్ యూనియన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తాము పరిస్థితిని దగ్గరుండి సమీక్షిస్తున్నామని.. ఇప్పటికే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఈస్ట్ మిడ్ లాండ్స్ హైవే ఈ ప్రమాదంపై స్పందించింది. కోర్బి నుంచి లండన్ లోని సెయింట్ పాన్‌క్రాస్ స్టేషన్ కు వెళ్లాల్సిన రైలు- నాట్టింగమ్ నుంచి సెయింట్ పాన్క్సాస్ స్టేషన్ కు వెళ్లాల్సిన రైలు ఒకదానికొకటి ఢీ కొన్నాయని వివరించింది. ఈ ఘటనతో లండన్ నుంచి సెయింట్ పాన్క్సాస్ స్టేషన్ కు ప్రయాణించాల్సిన అన్ని రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.