ఏ ముహూర్తంలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైందో కానీ.. సగటు మధ్యతరగతి జీవికి అసలు సినిమా కనిపిస్తోంది. మొన్నటి దాకా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు.. ఇప్పుడేమో మండుతున్న ఇంధన ధరలు నడ్డివిరుస్తున్నాయి.
మొన్నటి వరకూ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ మధ్యకాలంలో లీటర్ మీద రూ.10 వరకూ పెరిగాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంతో ఇంధన ధరలు తగ్గినా.. ఆ ప్రయోజనాలు మధ్యతరగతి జీవులకు చేరేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా విలువైనదిగా మారిపోయిన పెట్రోల్లోనూ కొంతమంది కేటుగాళ్లు కల్తీకి పాల్పడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల జేబుకు చిల్లెడుతున్నారు.పెట్రోల్, డీజిల్ కల్తీ కారణంగా ఒక్క డబ్బులు మాత్రమే నష్టపోతామే అంటే.. అలా కాదు. వాహనం మైలేజీ తగ్గిపోతుంది. వాహనాల ఇంజిన్లు కూడా దెబ్బతింటాయి. ఇలా వాహనదారులు పడే అవస్థలు ఎన్నో. ఈ నేపథ్యంలో పెట్రోల్ కల్తీని గుర్తించడం ఎలా విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనదేశంలో ఇప్పుడు ఉన్న చట్టాల ప్రకారం ఇంధన నాణ్యతను తెలుసుకునేందుకు వినియోగదారులు, లేదా వాహనదారులకు హక్కు ఉంది. ఇందుకోసం పెట్రోల్ బంకుల వద్ద కిట్లను నిర్వాహకులు అందుబాటులో ఉంచాలి. పెట్రోల్ కల్తీని గుర్తించే చిట్కాలు.. పెట్రోల్ నాణ్యత, స్వచ్ఛతను గుర్తించేందుకు ఫిల్టర్ పేపర్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. పెట్రోల్ కల్తీ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఓ మూడు చుక్కల పెట్రోల్ తెల్లని కాగితం వేసి పరీక్షించాలి. పెట్రోల్లో కల్తీ జరగనట్లయితే తెల్లటి కాగితం మీద ఎలాంటి మరక లేకుండా పెట్రోల్ ఆరిపోతుంది. ఒకవేళ కల్తీ పెట్రోల్ అయితే మాత్రం పేపర్ మీద నల్లటి జిడ్డు మరకలను గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పెట్రోల్ బంకులలో పెట్రోలు సాంద్రత (Density) కొలిచేందుకు హైడ్రోమీటర్ అనే పరికరం ఉంటుంది. సాధారణంగా పెట్రోల్ సాంద్రత 710- 770 మధ్య.. డీజిల్ సాంద్రత 810 - 870 మధ్య ఉండాలి. పెట్రోల్ కొట్టించే సమయంలో స్క్రీన్ మీద సాంద్రత వివరాలు కనిపిస్తాయి. మరోవైపు కొన్ని పెట్రోల్ బంకుల వద్ద ట్యాంపరింగ్ జరుగుతున్న ఘటనలను కూడా చూస్తున్నాం. స్క్రీన్ మీద పెట్రోల్ రీడింగ్ సరిగ్గానే ఉంటుంది. అయితే వాహనంలో నింపే పెట్రోల్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీనినే ట్యాంపరింగ్ అని అంటుంటారు. దీనిని కనిపెట్టేందుకు జార్ టెస్ట్ ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఐదు లీటర్ల కొలత కలిగిన జార్లో పెట్రోల్ నింపితే.. సరిగ్గానే ఉందా లేదా ట్యాంపరింగ్ జరిగిందా అనేది కనిపెట్టవచ్చని సూచిస్తున్నారు. ఎక్కడైనా పెట్రోల్ కల్తీ, ట్యాంపరింగ్ జరుగుతున్నట్లు గుర్తిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.