
సమంత ప్రస్తుతం ఒకప్పటిలా ఫాంలో లేదు. కరోనా, హెల్త్ సమస్యలు అంటూ సమంత కాస్త వెనకపడ్డారు. చేసిన కొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి.
ఇక ‘మా ఇంటి బంగారం’ ప్రాజెక్ట్ మీద ఎన్నో అంచనాల్ని సమంత పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరు అందించిన కథ కావడం, నందినీ రెడ్డి దర్శకత్వం, సమంత ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద సహజంగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాషా లెవెల్లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఊరించింది చిత్రయూనిట్. మరి ఆ అంచనాల్ని సినిమా అందుకుందా? లేదా? అన్నది చూద్దాం. కథ 90వ దశకం నేపథ్యం. బల్లవరం అనే గ్రామంలో కథ అంతా సాగుతుంది. బల్లవరంలో రాజకీయంగా రామయ్య రాజు (ఆనంద్) ఎంతో పలుకుబడి ఉంటుంది. అతని పెద్ద కొడుకు అనిరుధ్ (దిగంత్) స్వర్ణ (సమంత) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ కారణంతో ఫ్యామిలీ మొత్తం అతడ్ని దూరంగా పెడుతుంది. చెల్లి పెళ్లి కారణంగా అనిరుధ్ తన భార్యతో కలిసి మొదటి సారిగా ఇంటికి వస్తాడు. అదే సమయంలో సీఎం పర్యటన కూడా షెడ్యూల్ అవుతుంది. ఇక స్వర్ణ ఆ ఊరిలో అడుగు పెట్టగానే ఆమె గతం నీడలా వెంటాడుతూ ఉంటుంది. జైల్లో ఉండే కరుణ (గుల్షన్ దేవయ్య) మనుషులు స్వర్ణను ఝాన్సీ అంటూ వెంటాడుతుంటారు. స్వర్ణ రాకతో ఆ కుటుంబానికి కూడా సమస్యలు వస్తుంటాయి. అసలు ఈ స్వర్ణ ఎవరు? ఆమెని ఝాన్సీ అని ఎందుకు పిలుస్తారు? ఝాన్సీ గతం ఏంటి? ఈ కరుణకి ఝాన్సీకి ఉన్న లింక్ ఏంటి? చివరకు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుంచి స్వర్ణ ఎలా కాపాడుకుంటుంది? రాజ్ నిడిమోరు రైటింగ్ గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. హిందీలో రాజ్ అండ్ డీకే రాసిన ఎన్నో వెబ్ సిరీస్‌లు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. రాజ్ ప్రస్తుతం సొంతంగా ‘మా ఇంటి బంగారం’ కథ రాసుకున్నాడు. అయితే ఈ కథను రాసేందుకు రాజ్ పెద్దగా కష్టపడలేదనిపిస్తుంది. ఎప్పుడో అరిగిపోయిన ఫార్మాట్, బాషా టెంప్లెట్‌ను వాడుకున్నాడు. ఇలాంటి కథలతో ఎంతో మంది హీరోలు ఎన్నో సార్లు ప్రయత్నించారు. అయితే ఈ సారి ఇలాంటి ఓ పాత కథలో సమంతని చూడటం, ఆమె యాక్షన్ చూడటమే ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా థ్రిల్లింగ్‌గా, వావ్ ఈ సీన్ కొత్తగా ఉందే అని అనిపించదు. ప్రతీదీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఫన్, ఎమోషన్ ఇలా అన్నింటినీ కథలో జొప్పించారు. ఊర్లోకి స్వర్ణ రావడం, ఇంట్లో చిన్న కోడలి హవా.. మంచి పేరు తెచ్చుకోవాలని పెద్ద కోడలి ఆరాటం.. హీరోయిన్ ఫ్రెండ్‌గా కిరణ్మయి అనే పాత్రను తీసుకు రావడం ఇలా కథ అంతా ఎంటర్టైనింగ్గానే సాగుతుంది. ఇక స్వర్ణ గతానికి సంబంధించిన మనుషులు వెంటాడుతూ వస్తుండటం కథ మెల్లిగా పట్టాలెక్కినట్టు అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్‌కి చూపించిన ఫ్లాష్ బ్యాక్ అయితే అంత ఇంపాక్ట్‌గా అనిపించదు. సెకండాఫ్‌లో హీరోయిన్, విలన్ మధ్య పోటీలా సాగుతుంది. ఆ పోటీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఇలాంటి కథల్లో మాస్ హీరో ఉంటే.. చుట్టు పక్కల పాత్రలన్నీ ఎంత వీక్‌గా రాస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఇందులోనూ ఇలానే సమంత తప్పా.. మిగిలిన పాత్రలన్నీ చాలా వీక్‌గా కనిపిస్తాయి. ఇంట్లోనే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు.. సీఎంని కలిసే రేంజ్ ఉన్న పొలిటీషియన్ కూడా ఉంటాడు.. కానీ వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక అంతా తానై సమంత పాత్రే సినిమాని భుజాన మోసేస్తుంది. ఫైట్స్ విషయంలో మాత్రం సమంతకు విజిల్స్ పడతాయి. మాస్ హీరో రేంజ్లో సమంతను ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటారు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కి సమంత పర్ ఫెక్ట్ అని అనిపించుకుంటుంది. స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌తో సమంత అదరగొట్టేసింది. గన్ను తిప్పిన తీరుకి అంతా ఫిదా అవ్వాల్సిందే. అసలు ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని ఫ్యాన్స్ కూడా ఊహించరేమో. ఇందులోని కథ ఎంత పాతగా ఉన్నా.. ఊహాజనితంగా ఉన్నా.. సమంత చేయడం వల్ల కొత్తగా కనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సమంత ఆల్ రౌండర్‌గా అదరగొట్టేసింది. అమాయకంగా కనిపిస్తూనే యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టేసింది. చీరకట్టులోనే రౌడీల్ని చితక్కొట్టేస్తుంది. సమంత యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక సమంత తరువాత ఇందులోని ఏ పాత్ర కూడా అంత ఇంపాక్ట్ చూపించదు. గుల్షన్ దేవయ్య పాత్రలోని విలనిజం అంత కన్విన్సింగ్‌గా, ప్రభావవంతంగా కనిపించదు. రామయ్య రాజు, శరత్ రాజు, అనిరుధ్ ఇలా చాలా పాత్రలు వీక్‌గా కనిపిస్తాయి. శ్రీముఖి, బుచ్చిరాజు పాత్రల్ని కామెడీ వరకు వాడుకున్నారు. ఇక పెద్ద ఫ్యామిలీ కాబట్టి.. గౌతమి, శ్రీలక్ష్మి వంటి వారు ఉండాలి కాబట్టి పెట్టారనిపిస్తుంది. మిగిలిన పాత్రలు కూడా తమ తమ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్‌గా చూసుకుంటే.. ఇది చాలా వరకు 90వ దశకంలో తీశారనే ఫీలింగ్ కలగదు. నందినీ రెడ్డి తనకు ఇచ్చిన బాధ్యతకు వంద శాతం న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. సమంతను మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా చూపించింది. మ్యూజిక్ బాగుంది. పాటల కంటే.. యాక్షన్ సీక్వెన్స్‌లో కొట్టిన బీజీఎం అదిరిపోతుంది. ఇంటికి అందరు మహాలక్ష్మిలు రానక్కర్లేదు. కాళికా కూడా దేవతే వంటి డైలాగ్ సినిమా సోల్‌ని చెబుతుంది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంటుంది. విజువల్స్ బాగుంటాయి. నిర్మాణ పరంగా పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. దాదాపు ఒకే సెట్లో చుట్టేసినట్టుగా అనిపిస్తుంది. ‘మా ఇంటి బంగారం’ కథ, కథనం పరంగా ఎక్కడో ఆగిపోయినట్టు అనిపించినా.. సమంత మాత్రం మ్యాజిక్ చేస్తుంది. సమంత ఫ్యాన్స్‌కి ఓ ట్రీట్‌లా ఈ సినిమా అనిపిస్తుంది. మరి సమంత బాక్సాఫీస్ స్టామినా ఏంటి? కలెక్షన్స్ పరంగా, కమర్షియల్‌గా ఎలా ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.