SBI Mutual Fund IPO : స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి ఐపీఓ ల గురించి మంచి అవగాహనే ఉంటుంది. చాలా వరకు ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడి వస్తుంటుందని నిపుణులు చెబుతుంటారు. ఎక్కువగా ఇవి మంచి లిస్టింగ్ గెయిన్స్ నమోదు చేస్తుండటం ఇందుకు కారణం.
గత కొంత కాలంగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోగా.. ఐపీఓల సందడి కాస్త తగ్గింది. చాలా వరకు ప్రముఖ కంపెనీలు లిస్టింగ్ కోసం చూసినా.. మార్కెట్ పరిస్థితులు బాగోలేని కారణంగా వాయిదా వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు మాత్రం యుద్ధం ముగిసి, అమెరికా- ఇరాన్ మధ్య డీల్ కుదిరిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో మళ్లీ తమ ఐపీఓ ప్రణాళికల్ని బయటికి తీస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజి NSE.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దగ్గర డీఆర్‌హెచ్‌పీ (ప్రాథమిక ముసాయిదా పత్రాలు) సబ్మిట్ చేసింది.
ఆఫర్ ఫర్ సేల్ కింద దాదాపు 6 శాతం వాటా విక్రయంతో రూ. 30 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ విలువ రూ. 5 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా. త్వరలోనే రిలయన్స్ జియో కూడా ఐపీఓ కోసం సెబీకి అప్లికేషన్ పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జులై తొలి వారంలోనే..ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అతిపెద్ద ఐపీఓ గురించి అప్డేట్ వచ్చింది. అదే ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ విభాగం అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్. భారత్‌లోనే ఇది అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.
ఇదివరకు మార్చి 19న ఇది డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమర్పించగా తాజాగా సెబీ దీనికి ఆమోదం తెలిపింది. జూన్ 12నే అప్రూవల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అప్డేటెడ్ రెడ్ హెర్రింగ్
ప్రాస్పెక్టస్ (RHP) ఫైల్ చేసే యోచనలో ఉంది. అనుకున్నట్లు జరిగితే వచ్చే జులై తొలి వారంలోనే RHP ఫైల్ చేసి, ప్రైస్ బ్యాండ్ కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ ఐపీఓ విషయానికి వస్తే పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో ఉండనుంది. ఫ్రెష్ ఇష్యూ షేర్ల జారీ ఉండదు. ఓఎఫ్ఎస్లో భాగంగా 10 శాతం వాటా విక్రయించనున్నారు. 12.83 కోట్ల షేర్లను అమ్మేస్తున్న ఎస్బీఐ..ఈ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలో.. ఎస్బీఐకి 61.76 శాతం వాటా ఉండగా, ఫ్రెంచ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అముండీ ఇండియా హోల్డింగ్స్‌కు 36.26 శాతం వాటా ఉంది. ఇక్కడ ఎస్బీఐ తన వాటాలో నుంచి 6.3 శాతం వాటాకు సమానమైన 12.83 కోట్ల షేర్లను విక్రయిస్తుండగా, అముండి 3.7 శాతం వాటాకు సమానమైన 7.54 కోట్ల షేర్లు విక్రయిస్తోంది. సుమారు రూ. 13 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.