.webp&w=3840&q=75)
మూడు భారీ భవనాలు.. 12 బెడ్ రూమ్ లు.. అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, షాండ్లియర్లు, రెండు సెంట్ల విస్తీర్ణంలో బాత్రూంలు, ఏ వస్తువు చూసినా లక్షల రూపాయల ఖరీదు.. ఇదీ జగన్ తన హయాంలో జనం సొమ్ముతో నిర్మించిన రుషికొండ ప్యాలస్. విశాఖ తీరాన రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మానం అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పటి ముఖ్యమంత్రి తన విలాస నివాసం కోసం ప్రజాధనంతో నిర్మించుకున్న ప్యాలెస్.
గత ఐదేళ్లుగా పేదల కోసమే తన ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్ హయాంలో నిర్మితమైన పెత్తందారీ ప్యాలెస్ రుషికొండ ప్యాలెస్. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రాజసౌధం కేవలం తన కోసం నిర్మించుకున్నారు. జగన్ ఐదేళ్లలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ రుషికొండ ప్యాలెస్.
452 కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన భవనాలు కట్టారు. ఇందు కోసం ఏకంగా రుషికొండకు బోడి గుండు కొట్టించారు. 12 బెడ్ రూములు, ఒక్కో బెడ్ రూమ్ కూ అటాచ్ బాత్రూం, అత్యంత ఖరీదైన ఫర్నీచర్.. మళ్లీ అధికారం తనదేనన్న నమ్మకంతో తన కోసం జగన్ నిర్మించుకున్న ఈ ప్యాలెస్ కోసం గతంలో నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను కూలగొట్టారు.
రిసార్టులు కడుతున్నామన్న పేరుతో సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు. జగన్ నివాసంతో పాటు సీఎం కార్యాలయం కోసం ఈ భవంతులను కట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ నటులు కొన్ని మిలియన్ డాలర్లు వెచ్చించి కొట్టుకునే అత్యంత విలాసవంతమైన భవనాలను తలదన్నేలా రుషికొండ ప్యాలెస్ ను నిర్మించారు.
2024లో వైసిపి ఓడిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ నిర్మించిన రుషికొండ ప్యాలెస్ బాగోతం బయటపడింది. అంతకు ముందు.. అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో రుషి కొండవైపుగా చీమ కూడా వెళ్లే అవకాశం కూడా లేనంతగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
చేశారు. ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వందలాది మంది పోలీసులను మొహరించి అడ్డుకుంది అప్పటి జగన్ సర్కార్.
ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న దానిపై మల్లగుల్లాలు పడింది. ఈ భవనాల నిర్వహణ ఖర్చులు సామాన్యమైనవి కావు. కేవలం ఈ భవన సముదాయం నిర్వహణ కోసం నెలనెలా పాతిక 25 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. అంతేకాకుండా.. లోపల ఉన్న అత్యంత విలువైన వస్తువులను, అత్యాధునిక ఇంటీరియర్స్‌ను భద్రపరచడానికి, మెయింటైన్ చేయడానికి ఏకంగా 1.5 కోట్ల భారీ వ్యయం అవుతోంది.
దీంతో ప్రజాధనం వృధాను అరికట్టడానికీ, దానిని ప్రభుత్వానికి ఆదాయవనరుగా వినియోగిం చుకునేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయడానికి మంత్రుల కమిటీ వేసింది. చివరకు ఆ కమిటీ ఈ ప్యాలెస్ ను లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి అధికారిక సిఫార్సులు చేయాలని నిర్ణయించింది.
అంతకు ముందు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తెలుగుదేశం కూటమి ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కొంతమంది దీనిని మానసిక వైద్యశాలగా మార్చాలని, మరికొందరు స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉంచాలన్నారు పేర్కొన్నారు. చాలా మందైతే రుషికొండ ప్యాలెస్ ను కూల్చేయాలని సూచించారు. అయితే, మెజారిటీ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను, విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని, దీనిని ఒక ప్రతిష్టాత్మక హాస్పిటాలిటీ ప్రాజెక్టుగా మార్చడమే సరైన మార్గమని కమిటీ భావించింది.
.